ఉద్యోగుల మెడపై కత్తిపెట్టిన విప్రో.. ఏంటీ దారుణ నిబందనలు?
నూతన సంవత్సరం వేళ ఐటీ ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయని ఆశిస్తే.. దేశీయ ఐటీ దిగ్గజ విప్రో మాత్రం తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది.;
కొత్త సంవత్సరం ఎవరైనా కొత్తగా స్ట్రాట్ చేద్దాం.. ఏదైనా సాధిద్దాం.. ముందుకు దూసుకుపోదాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అవుతోంది. ఏఐ, ఆటోమేషన్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానకష్టం అవుతోంది. అసలు 20ఏళ్లు పనిచేసిన వారిని కూడా నిర్ధాక్షిణ్యంగా తీసేస్తున్న రోజులు ఇవీ.. దీంతో భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
నూతన సంవత్సరం వేళ ఐటీ ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయని ఆశిస్తే.. దేశీయ ఐటీ దిగ్గజ విప్రో మాత్రం తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వర్క్ ఫ్రం ఆఫీస్ (డబ్ల్యూ.ఎఫ్.ఓ) నిబంధనలు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కేవలం ఆఫీస్ కు వస్తే సరిపోదు అని.. అక్కడ గడిపే ప్రతి నిమిషం లెక్క తేలాల్సిందేనని కంపెనీ స్పష్టం చేసింది.
ఆరు గంటలు ఉండాల్సిందే.. లేదంటే లీవ్ కట్!
విప్రో తాజాగా ప్రవేశపెట్టిన నిబంధనల్లో అత్యంత కఠినమైనది 'సిక్స్ అవర్ రూల్'. ఇప్పటివరకు హైబ్రిడ్ మోడల్‌లో భాగంగా వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆఫీస్‌కు వచ్చిన రోజున కనీసం 6 గంటల పాటు ఆఫీస్ ప్రాంగణంలోనే ఉండాలి. ఒకవేళ 6 గంటల కంటే ఒక్క నిమిషం తక్కువ ఉన్నా, ఆ రోజును హాఫ్ డే సగం రోజు సెలవుగా పరిగణిస్తారు. వారానికి నిర్దేశించిన హాజరు శాతం తగ్గితే నేరుగా ఉద్యోగి లీవ్ బ్యాలెన్స్ నుండి సెలవులను కోత విధిస్తారు.
వర్క్ ఫ్రం హోమ్ (డబ్ల్యూ.ఎఫ్.ఓ) పై కోత
గతంలో అత్యవసర పరిస్థితుల్లో లేదా అనారోగ్య కారణాలతో ఇంటి నుండి పనిచేసేందుకు ఏడాదికి 15 రోజుల వెసులుబాటు ఉండేది. తాజా నిబంధనల ప్రకారం దీన్ని 12 రోజులకు తగ్గించారు. ఇది కూడా కేవలం మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే వాడుకోవాలని కంపెనీ షరతు పెట్టింది.
పని గంటలు 9.5 వరకు ఉండొచ్చు!
ఆరు గంటల నిబంధన అనేది కేవలం హాజరు నమోదుకు మాత్రమేనని.. ప్రాజెక్ట్ డెలివరీ అవసరాలను బట్టి ఉద్యోగులు రోజుకు 9.5 గంటల వరకు పని చేయాల్సి ఉంటుందని విప్రో తన అంతర్గత ఈమెయిల్‌లో పేర్కొంది. దీనివల్ల ఉద్యోగులపై పని భారం పెరగడమే కాకుండా వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎందుకు ఈ కఠిన నిర్ణయాలు?
సుమారు 2.34 లక్షల మంది ఉద్యోగులు ఉన్న విప్రో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలున్నాయి. ఆర్థిక మందగమనం వల్ల ఐటీ రంగం నెమ్మదించింది. ఉద్యోగులు ఆఫీస్‌లో ఉంటే ఉత్పాదకత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతున్న నేపథ్యంలో మానవ వనరుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయంగా ఐటీ ప్రాజెక్టుల రాక తగ్గడంతో ఉన్న వనరులతో గరిష్ట ఫలితాలు సాధించడంపై యాజమాన్యం దృష్టి పెట్టింది.
కరోనా తర్వాత అలవాటైన 'వర్క్ ఫ్రం హోమ్' సౌకర్యానికి విప్రో దాదాపు చెక్ పెట్టినట్లయింది. ఈ కొత్త నిబంధనలు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర నగరాల నుండి వచ్చి పనిచేసే వారికి చిన్న పిల్లలున్న తల్లులకు ఈ 'సిక్స్ అవర్ రూల్' పెద్ద సవాలుగా మారనుంది. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.