అమెజాన్ లో 30 వేల ఉద్యోగాలు తొలగింపు.. ఏఐ ఎఫెక్ట్
దిగ్గజ సంస్థ అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే అక్టోబర్ లో 14000 ఉద్యోగాలు తొలగించిన అమెజాన్... త్వరలో అదే స్థాయిలో ఉద్యోగులను తొలగించబోతున్నట్టు తెలుస్తోంది.;
దిగ్గజ సంస్థ అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే అక్టోబర్ లో 14000 ఉద్యోగాలు తొలగించిన అమెజాన్... త్వరలో అదే స్థాయిలో ఉద్యోగులను తొలగించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ సంస్థంలో మొత్తంగా 15లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యతో పోల్చితే 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు చిన్న విషయమే అన్న వాదన కూడా ఉంది. అయితే అమెజాన్ చరిత్రలో 30 వేల మంది ఉద్యోగులను తొలగించడం తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. 2022లో 27 వేల మందిని తొలగించారు. కానీ ఇప్పుడు మాత్రం తొలగిస్తున్న వారి సంఖ్య అంతకు మించి ఉంది. అక్టోబర్ లో తొలగించిన 14 వేల మంది ఉద్యోగులకు అమెజాన్ మూడు నెలల వేతనం అందించింది.
ఎందుకు తొలగిస్తోంది ?
అమెజాన్ ఉద్యోగులను తొలగించడం వెనుక ఉన్న కీలక కారణం కృత్రిమ మేధ (ఏఐ). మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని, కంపెనీలో ఉన్న బ్యూరోక్రటిక్ లేయర్స్ ను తగ్గించాలని అమెజాన్ యోచిస్తోంది. దీని ఫలితంగా మరింత ఉత్తమ సామర్థ్యంతో పని చేయగలమని నమ్ముతోంది. అదే సమయంలో ఆర్థిక స్థితిగతులు కూడా ఉద్యోగులను తొలగించడానికి కారణమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు టెక్ ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక ఒత్తిడి కారణంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చు తగ్గించే పనిచేస్తున్నాయి. ముఖ్యమైన ఉద్యోగులను మాత్రం తొలగించే పరిస్థితి లేదు. అదే సమయంలో కొన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది.
అమెజాన్ లో మాత్రమేనా ?
అమెజాన్ మాత్రమే కాదు. టెక్ ఇండస్ట్రీలోని చాలా కంపెనీలు ఆర్థికపరమైన ఒత్తిడితో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఏఐలో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతోంది. తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేసే పరిస్థితి ఏఐతో సాధ్యమవుతోంది. అందుకే ఆర్థిక స్థితిగతులను అంచనా వేసుకుని, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదంలో వైట్ కాలర్ ఉద్యోగాలు..
అమెజాన్ లో తొలగిస్తున్న ఉద్యోగాలన్నీ వైట్ కాలర్ జాబ్ లే. ఏఐ రాకతో వైట్ కాలర్ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఏఐ మీద కంపెనీలు పెట్టుబడులు పెడుతూ.. ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఏఐను వినియోగించడం ప్రారంభమైంది. ఏఐ వినియోగం పై పట్టు ఉన్న వారి ఉద్యోగాలు నిలబడుతున్నాయి. అదే సమయంలో ఏఐ చేయగల ఉద్యోగాల్లో ఉన్న వారి ఉద్యోగాలు తొలగిస్తున్నారు. దీంతో భవిష్యత్తు మరింత ప్రమాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వైట్ కాలర్ ఉద్యోగాలు ఊడిపోతుంటే.. మరోవైపు బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.