ఏఐ దెబ్బకు ఐటీ కోటలు బద్ధలు: ఫ్రెషర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

ఒకప్పుడు ఇంజినీరింగ్ పట్టా చేతికి రాగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గ్యారెంటీ అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు ఐటీ రంగం ముఖచిత్రం వేగంగా మారిపోతోంది.;

Update: 2026-02-13 13:30 GMT

ఒకప్పుడు ఇంజినీరింగ్ పట్టా చేతికి రాగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గ్యారెంటీ అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు ఐటీ రంగం ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశంతో సాంప్రదాయ ఉద్యోగ సమీకరణాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్లకు ఈ మార్పు ఒక అగ్నిపరీక్షగా మారింది.

మారిపోతున్న కొలువుల లెక్కలు

గతంలో ఫ్రెషర్లు చేసే డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్ , కస్టమర్ సపోర్ట్ వంటి పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ రెప్పపాటులో పూర్తి చేస్తున్నాయి. కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతుండటంతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కోత మొదలైంది. 2023-2025 మధ్య ఎంట్రీ-లెవల్ ఉద్యోగ ప్రకటనలు 30-35% మేర తగ్గిపోయాయి. ఇంటర్న్‌షిప్ అవకాశాలు కూడా 15% క్షీణించాయి. మన దేశంలో ఐటీ హైరింగ్ దాదాపు 24% తగ్గింది. ఏటా 10 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తుండగా, వారికి సరిపడా 'స్టార్టర్' ఉద్యోగాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మేనేజర్ల చూపు.. AI వైపు!

ప్రస్తుత నివేదికల ప్రకారం.. సుమారు 60% మంది మేనేజర్లు జూనియర్ లెవల్ పనులను ఏఐ ద్వారానే చేయించాలని భావిస్తున్నారు. దీనివల్ల పని వేగవంతం అవ్వడమే కాకుండా మానవ తప్పిదాలు తగ్గుతాయని వారి నమ్మకం. అయితే ఏఐ ఇచ్చే ఫలితాల్లో 27-28% లోపాలు ఉంటున్నాయని.. అక్కడ మనుషుల పర్యవేక్షణ తప్పనిసరని కూడా గణాంకాలు చెబుతున్నాయి.

నైపుణ్యాల కొరత.. భవిష్యత్తు ముప్పు

కేవలం ఉద్యోగాల కోతే కాదు... దీనివల్ల భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన సీనియర్ లీడర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఫ్రెషర్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. టీమ్ వర్క్ , సమస్య పరిష్కార నైపుణ్యాలు పనిలో అనుభవంతోనే లభిస్తాయి. గ్రౌండ్ లెవల్ పనులు చేయకుండా నేరుగా సీనియర్ బాధ్యతలు చేపట్టడం అసాధ్యం.

ఫ్రెషర్లు ఏం చేయాలి? కొత్త యుగంలో రాణించే సూత్రాలు

పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్నవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. భయపడటం కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారడమే ఏకైక మార్గం. కోడింగ్ మాత్రమే కాదు ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోవాలి. ఏఐ ఇచ్చే ఔట్‌పుట్‌ను విశ్లేషించి, అందులోని తప్పులను సరిదిద్దే సామర్థ్యం పెంచుకోవాలి. కేవలం సర్టిఫికెట్లు కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్టులు చేసి చూపించాలి. లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిపుణులతో సంబంధాలు పెంచుకోవాలి.

ఐటీ రంగంలో డిగ్రీ మాత్రమే సరిపోయే రోజులు పోయాయి. ఇప్పుడు "నిరంతర అభ్యాసం" మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏఐ అనేది మన ఉద్యోగాలను లాగేసుకునే శత్రువు కాదు... అది మన పనిని సులభతరం చేసే ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని లొంగదీసుకున్న వాడే రేపటి విజేత.

Tags:    

Similar News