బెజవాడ కొనుగోళ్లు ఇంతలా మారాయా?
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. వర్తమానం గతంలా మారి.. భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చే సంధిదశలో మనం ఇప్పుడు ఉన్నాం. మరో వారంలో 2025 ముగుస్తుంటే.. అదే సమయంలో 2026 ముంగిట్లోకి రానుంది.;
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. వర్తమానం గతంలా మారి.. భవిష్యత్తు వర్తమానంలోకి వచ్చే సంధిదశలో మనం ఇప్పుడు ఉన్నాం. మరో వారంలో 2025 ముగుస్తుంటే.. అదే సమయంలో 2026 ముంగిట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లలో వచ్చిన మార్పులకు సంబంధించిన రిపోర్టులు వస్తున్నాయి. తాజాగా ఇన్ స్టా మార్పు తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో టైర్ టూ సిటీగా పేరున్న విజయవాడ ప్రజల కొనుగోళ్ల తీరును విశ్లేషించింది. అందులో ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఏపీలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరున్న విజయవాడలో ఈ ఏడాదిలో వచ్చిన వ్యాపార మార్పులు.. ప్రజల కొనుగోళ్లలో చోటు చేసుకున్న మార్పులకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యవసర వస్తువుల్ని సైతం ఆన్ లైన్ లో తెప్పించుకునే తీరు ఎక్కువైంది.
చివరకు చుక్కకూర.. ఉల్లిపాయ.. టమాటా.. పంచదార.. కుర్ కురే లాంటి వాటిని సైతం ఆన్ లైన్ లో కొనేస్తున్నారు. ఉదయానే లేచిన సమయాన ఎక్కువగా నిత్యవసర వస్తువుల ఆర్డర్లు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసే వస్తువుల్లో చుక్కకూర మొదటిస్థానంలో నిలిస్తే తర్వాతి స్థానాల్లో ఉల్లిపాయలు.. టమాటాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బంగాళదుంపలు.. సన్ ఫ్లవర్ ఆయిల్ లాంటి వస్తువుల ఆర్డర్లు కూడా భారీ పెరుగుదల కనిపించింది.
అదే సమయంలో థమ్స్ అప్.. లేస్.. బింగో.. కుర్ కురే.. బిస్లరీ.. విమ్ లాంటి ఉత్పత్తులను కూడా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. బ్యాగులు.. వాలెట్ల ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 538 శాతం పెరిగినట్లుగా తేల్చారు. ఫిట్ నెస్.. క్రీడలకు సంబంధించిన ఉపకరణాల కొనుగోళ్లలో 495 శాతం.. సౌందర్య సాధనాల్లో 330 శాతం.. బొమ్మలు 245 శాతం.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో 223 శాతం పెరుగుదల కనిపించింది. బెజవాడకు చెందిన ఒక వ్యక్తి ఏడాదిలో రూ.3.62 లక్షల విలువైన ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి మొదటిస్థానంలో నిలిచినట్లుగా పేర్కొన్నారు. మరో నలుగురు సైతం ఏడాదిలో రూ.3 లక్షలకు పైనే తమ వద్ద కొనుగోళ్లు చేసినట్లుగా గుర్తించారు. ఇదంతా చూస్తే.. మహానగరాల మాదిరే బెజవాడోళ్లు మారిపోతున్నారని చెప్పక తప్పదు.