అవసరం - వ్యసనం మధ్య సన్నని గీత గీసుకున్నారా..!
అవును... కాలం చాలా వేగంగా ప్రవహిస్తున్న ఈ ప్రపంచంలో నేటి యువత నిరంతరం తమ జీవితాలను ఆన్ లైన్ లోనే గడిపేస్తుందనే ఫిర్యాదులు బలంగా వినిపిస్తున్నాయి.;
ఈ ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది.. ప్రధానంగా సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి రాకతో ఖండాల మధ్య సామాజిక సరిహద్దులు చెరిగిపోయాయి.. ఇక ఏఐ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ముందు ముందు పూర్తిగా మనిషికి మనిషి అవసరం ఒక ఆప్షన్ మాత్రమే అనే పరిస్థితులు రానున్నాయి! ఈ సమయంలో.. అవసరానికి, వ్యసనానికి మధ్య సన్నని గీత గీసుకున్నారా అనేది కీలకంగా మారింది.
అవును... కాలం చాలా వేగంగా ప్రవహిస్తున్న ఈ ప్రపంచంలో నేటి యువత నిరంతరం తమ జీవితాలను ఆన్ లైన్ లోనే గడిపేస్తుందనే ఫిర్యాదులు బలంగా వినిపిస్తున్నాయి. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అన్నట్లుగా మారిపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో.. మద్యపానం, ధూమపానం వంటి సంప్రదాయ చెడు అలవాట్లతో పోల్చదగిన కొత్త రకం వ్యసనంగా ఇది మారుతుందనేవారూ లేకపోలేదు!
యువత ప్రధానంగా అవసరం / సామాజిక ప్రయోజనం కోసం స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించాల్సిన అవసరం నుంచి.. ఆ ఫోన్ ఎవరి చేతుల్లో అయినా పడితే ఏమేమి కోల్పోతామొ అనే భయం.. ఈ గ్యాప్ లో ఏదైనా మిస్సవుతున్నామనే ఆలోచనతో నిత్యం లాగిన్ అవ్వడం వంటి ఒత్తిడికి మధ్య కనిపించని సన్నని గీత గీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు నిపుణులు.
ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ వ్యసనం ముఖ్యంగా యువతపై మానసిక, సామాజిక, శారీరకంగా తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. దానికి కారణం కనిపించని ఆ సన్నని గీత గీసుకోకపోవడమే! కుటుంబ సభ్యులతో, ఉపాధ్యాయులతో, పాత స్నేహితులతో, మైదానంలో ఆటలతో వ్యక్తిగతంగా, భౌతికంగా సమయం గడిపే రోజులు పోవడానికి ఇదే కారణమని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... సెల్ ఫోన్ వాడటం అంటే అది కేవలం స్క్రీన్ వ్యసనం మాత్రమే కాదు.. దీని వెనుక ముడిపడి మరెన్నో వ్యసనాలు ఉన్నాయి! ఇందులో భాగంగా... జూదం, కంపల్సివ్ షాపింగ్, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వ్యసనం, సైబర్ లైంగిక వ్యసనం, ఆన్ లైన్ రిలేషన్ షిప్స్ వ్యసనం ఉన్నాయి. నిద్రలేమి, చికాకు, ఇతర విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం అని అంటున్నారు నిపుణులు.
ఈ నేపథ్యంలోనే.. టీనేజర్లు తమ జీవితంలో గందరగోళం, ఆందోళనతో నిండిన దశను ఎదుర్కొంటున్నారని.. ఈ సమయంలో వారు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల.. ఒకరు చెబితే వినే అలవాటులేని యువత.. ఈ విషయంలో సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవాలని, స్క్రీన్ టైం కు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని.. వారు అనుకుంటే అవుతుందని చెబుతున్నారు.