అతిధివి....అతి చేయకు !
అవును నీవు అతిధివి. ఈ భూమి మీద కొన్నాళ్ళ పాటు జీవించడానికి వచ్చిన అతిధివి.;
అవును నీవు అతిధివి. ఈ భూమి మీద కొన్నాళ్ళ పాటు జీవించడానికి వచ్చిన అతిధివి. ఈ భూమి నీకు ముందూ ఉంది తరువాత ఉంది, అలాగే ప్రకృతి వనరులు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని నీవు ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నీకు ఇచ్చిన టైంలో హాయిగా గడిపేయాలి. అంతే తప్ప అతి చేయాలనుకోకు. నీవే శాశ్వతం అనుకుని విర్రవీగకు. నీ కంటే మొనగాళ్ళు, పోటు గాళ్ళు ఎంతో మంది ఈ భూమి మీదకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కాలం నిశ్శబ్దంగా వారిని సాగనంపింది. భూమి తనలో వారిని ఇముడ్చుకుంది. అలా యుగాలు జగాలు ఎన్నో గడచిపోయాక నీవు కూడా వారి మాదిరిగానే వచ్చారు, వారి లాగానే వచ్చావు. వారికీ నీకూ తేడా ఏమీ లేదు. రేపు నీ టైం అయిపోగానే కాలం ఇంతే నిశ్శబ్దంగా నిన్ను కూడా తనలో కలిపేసుకుంటుంది. కాళ్ళ కింద మట్టి శాశ్వత నిద్రకు కట్టెల పరుపు పరుస్తుంది. అంతటితో ఖేల్ ఖతం అవుతుంది.
స్వార్ధంగా ఉండాలా :
పుట్టడం గిట్టడం మధ్యలో చేయాల్సింది ఏమీ లేదా వైరాగ్యమేనా అని అనుకోవద్దు. ఈ భూమి మీద నీకో జీవితం వచ్చింది. దానిని నీకు చేతనైనంత వరకు అందంగా మార్చుకో. జీవించడమే గెలుపు అని తెలుసుకో. నీకు ఈ భూమి మీద ఇచ్చిన స్లాట్ లో నీవేంటో నిరూపించుకో. స్వార్ధంగా బతకడం అన్నది కాదు నిర్మాణాత్మకమైన స్వార్ధంగా జీవించడం తెలుసుకో. మరీ ఏవీ లేవు కావు అనుకోకుండా నీకు ఏమి కావాలో నిన్ను నమ్ముకున్న వారికి ఏమి కావాలో చూడు. అది నీ బాధ్యత. వాటి కోసమే తపించు. ఈ విధమైన పోరాటంలో నిజాయతీగా పరిశ్రమించు. నీవీ నీ కుటుంబమే జీవితం అని భావించవద్దు. నీ కుటుంబం బాధ్యతలు తీరాక సమాజం వైపు కూడా కాస్తా చూడు.
సమాజంలో ఒకడివి :
నీవు ముందు కుటుంబ సభ్యుడివి అయితే కావచ్చు. సమాజానికి కూడా ఒక బాధ్యత గలిగిన సభ్యుడివే అని మరవకు. అలా నీవు ఉన్న ప్రాంతానికి దేశానికి బద్ధుడిగా ఉండు. వీలైనంతగా మేలు చేయడానికి చూడు. కలలో కూడా హాని తలపెట్టడం అన్నది తలవకు. ముఖ్యంగా అందరి బాగు కోరుకో. అందులో నీవుండాలని భావించుకో. అపుడే నీవు పుట్టిన దానికీ నీవు నేర్చిన చదువుకు సాధించిన నైపుణ్యానికి పుణ్యం ధన్యం దక్కుతాయి.
ఎలా ఉందో అలా :
భూమి అందమైనది, ప్రకృతి ఇంకా గొప్పది. వాటిని కాపాడాల్సిన బాధ్యత నీదే. నీవు పుట్టినప్పుడు అవి ఎలా ఉండేవో తెలుసు కదా. వాటి వల్ల ఎంతో లబ్ది పొందావు కదా. మళ్ళీ వాటిని పాడుచేసి శాశ్వతం కాని నీ జీవితం కోసం మేడలు కోటలు కట్టుకోవడం అవసరమా. ప్రకృతి విధ్వంసం అన్నది అతి పెద్ద తప్పు, నీరు గాలి, భూమి ప్రకృతి ఇలా పంచ భూతాల మీద పగబట్టి మరీ హింస పెట్టి రేపు నీవు పోయాక వచ్చే కొత్త అతిధిల కోసం ఈ నేల మీద ఏమి మిగులుస్తున్నావు. ఈ భూమి ఇప్పటికే మనిషి మనుగడకు కుదరక ఇబ్బంది పడేలా చేస్తున్నారు కదా. మళ్ళీ మనుషులు జీవించేందుకు కొత్త గ్రహాలు ఏవైనా ఉన్నాయా అని పరిశోధన కూడా చేస్తున్నారు. అంటే ఎంతో విలువైన ఈ భూ గ్రహం మనిషి స్వార్థానికి బలి అయిపోతోంది. ఆ మిగిలిన గ్రహాలు అయినా సవ్యంగా ఉండనీయరాదా అని ప్రకృతి మాత మొత్తుకుంటోంది, అది నీ చెవులకు వినబడదా.
అన్నింటి కోసమే :
ఈ భూమి మీద మనిషి ఒక్కడే లేడు, ఎనభై నాలుగు లక్షల జీవ రాశులు ఉన్నాయి. చెట్లూ చేమా ఉన్నాయి. నదులూ జల వనరులూ ఉన్నాయి. ఇలా ప్రకృతిలో కలసి ఆ ఆసరాతో జీవిస్తూ ఎన్నో ఉన్నాయి. మరెన్నో ఆధారపడి ఉన్నాయి. మెదడు ఉంది కదా అని తెలివి ఉంది కదా అని నీ తెలివి తేటలతో సర్వ నాశనం చేస్తాను అంటే వాటి గతేంటి, ఇతర జీవరాశులు ఏమి పాపం చేశాయన్నది ఆలోచిస్తున్నావా. ఈ భూమి మీద మనిషికి ఎంత హక్కు ఉందో ఇతర జీవులకూ ఉంది కదా. ఈ సూక్ష్మం ఎలా గ్రహించలేకపోయారు. మరి నిన్ను వివేకవంతుడని ఎలా అనుకోవాలి. చుట్టు పక్కల చూడకుండా ఏ మాత్రం పట్టింపు లేకుండా భూమి లోపలా పైనా ఆకాశం దాకా అంతా దోచేస్తూ పోతే రేపు నీవు ఎలాగూ ఈ భూమి మీద ఉండవు, అది వేయి శాతం గ్యారంటీ. మరి నీతోనే ఈ భూమి ప్రకృతి కూడా పోవాలనా. ఇకనైనా ఆపు నీ స్వార్థ రాక్ష విన్యాసం. అతిధిని అని సదా మనసులో తలచుకో. ఎపుడైనా ఈ జాగాని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఎప్పటికీ గుర్తు పెట్టుకో. స్వార్థం కాస్తా తగ్గించుకో. అందరి కోసం ఆలోచించు. అపుడు దేవుడు గుడి వైపు వెళ్ళాల్సినది లేదు, దేవుడి పటాలకు మొక్కాల్సిన అవసరమూ లేదు, మనిషిగా నీవే మహోన్నతుడిగా ఉంటావు. ఇలా వచ్చిన అతిధులు అందరూ ఆలోచిస్తే ఈ ప్రకృతే నిన్ని దీవిస్తుంది. మరిన్నాళ్ళు ఆయుష్షుని పంచి నిన్ను ఇక్కడ ఉండేలా చేస్తుంది.