అమెరికాలోకి రాకుండా ట్రంప్ అడ్డంగా నిలబడుతున్నాడే?

‘తా తలిచింది రంభ.. తాను మునిగింది గంగ’ అన్నట్టుగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచదేశాలపై పిడుగులా పడిపోతున్నాడు మన ట్రంప్ గారు.;

Update: 2025-12-17 19:30 GMT

‘తా తలిచింది రంభ.. తాను మునిగింది గంగ’ అన్నట్టుగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచదేశాలపై పిడుగులా పడిపోతున్నాడు మన ట్రంప్ గారు. అసలు ఓ విధానం అంటూ లేకుండా ప్రపంచదేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేస్తున్నారు. ఆ దేశ పౌరులు అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ హుకూం జారీ చేస్తున్నారు. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే కొన్ని దేశాలకు ఇప్పుడు ద్వారాలు మూసుకుపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘అమెరికా ఫస్ట్’ విధానంలో భాగంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడమే కాకుండా విదేశీయుల రాకపై కఠిన నియంత్రణలు విధిస్తూ తన ‘ట్రావెల్ బ్యాన్’ ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించాడు. జాతీయ భద్రత, అక్రమ వలసలు, అంతర్గత రక్షణను సాకుగా చూపుతూ మరో ఐదు దేశాలపై ఆంక్షలు విధిస్తూ శ్వేత సౌధం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా నిషేధిత జాబితాలోకి చేరిన దేశాలు

తాజా విస్తరణతో ఆఫ్రికా, మద్య ప్రాచ్యానికి చెందిన ఐదు దేశాల పౌరులకు అమెరికా తలుపులు దాదాపు మూసుకుపోయాయి. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, సౌత్ సూడాన్, సిరియా.. ఈ ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, వీసా దరఖాస్తుదారులపై తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండడం ఆయా ప్రభుత్వాలు ప్రయాణికుల గుర్తింపు సమాచారాన్ని అమెరికాతో పంచుకోవడంలో విఫలం కావడమే ఈ కఠినచర్యకు ప్రధాన కారణాలని అధికారులు పేర్కొన్నారు.

భారీగా పెరిగిన ఆంక్షల పరిధి

ట్రంప్ తీసుకున్న ఈ తాజానిర్ణయంతో అమెరికా ప్రయాణ ఆంక్షల దేశాలు పెరిగాయి. మొత్తం 12 దేశాల పౌరులకు అమెరికాలో ప్రవేశం పూర్తిగా నిలిపివేయబడింది. మరో 15 దేశాలపై ప్రత్యేక నిఘా, పరిమిత వీసా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీనివల్ల కేవలం పర్యాటకులు మాత్రమేకాకుండా.. ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు, ఉద్యోగ రీత్యా వెళ్లే ప్రొఫెషనల్స్ , శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీసా ఇంటర్వ్యూలలో కఠినమైన ప్రశ్నలు, సుధీర్ఘమైన బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భద్రత కోసం తప్పదంటున్న ట్రంప్

అక్రమ వలసలను అరికట్టడం తన ప్రభుత్వ మొదటిప్రాధాన్యత అని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. మా దేశ ప్రజల విషయంలో మేం రాజీపడబోము.. ఎవరి గుర్తింపు అయితే మాకు స్పష్టంగా తెలియదో ఎవరి నేపథ్యం అయితే అనుమానాస్పదంగా ఉంటుందో వారిని మా భూభాగంలోకి అనుమతించే ప్రసక్తే లేదు అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో ఘాటుగా స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద తనిఖీలను పటిష్టం చేయడం ద్వారా ఉగ్రవాద ముప్పును తగ్గించవచ్చని ట్రంప్ పరిపాలన భావిస్తోంది.

గందరగోళంలో బాధితులు

ట్రంప్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు, వలసదారుల హక్కుల కార్యకర్తలు ఈచర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.కొన్ని ప్రాంతాలు, వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపిస్తున్నారు. యుద్ధ పీడిత దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టు అని అంటున్నారు. అమెరికాలో చదువాలనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఏం జరుగనుంది?

ట్రంప్ ప్రభుత్వం అమలు చేసే ట్రావెల్ బ్యాన్ న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కోర్టులు స్టే ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ ట్రంప్ యంత్రాంగం పక్కా ఆధారాలు, జాతీయ భద్రతా నివేదికలతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర పాశ్చాత్య దేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. వలస విధానాలు మరింత కఠినతరం కానున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News