'జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌' నౌకకు ఏమైంది..? నాటో స్థావరం వైపునకు కదికలో ఆంతర్యం ఏంటి?

ఈ ప్రమాదంలో ఇద్దరు సైలర్లకు గాయాలవ్వగా, ఆస్తి నష్టం ఊహించని స్థాయిలో జరిగింది. నౌకలోని సుమారు 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం.;

Update: 2026-03-19 09:26 GMT

సముద్రం నడిబొడ్డున కోటలాంటి విమాన వాహక నౌక (Aircraft Carrier) ఉంటే శత్రువులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కానీ, అమెరికా గర్వకారణంగా చెప్పుకునే 'జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌' విషయంలో కథ అడ్డం తిరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, శక్తిమంతమైన ఈ యుద్ధనౌక, శత్రువుల క్షిపణుల వల్ల కాకుండా తన ఇంట్లోనే జరిగిన ఒక 'నిప్పు' వల్ల ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని వీడాల్సి రావడం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఒక చిన్న లాండ్రీలో మొదలైన మంటలు 30 గంటల పాటు ఎలా కొనసాగాయి? అనే ఉత్కంఠభరితమైన వివరాల్లోకి వెళ్తే..

యుద్ధక్షేత్రం నుంచి నిష్క్రమణ

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న సమయంలో, అమెరికాకు చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక ‘జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’ అనూహ్యంగా యుద్ధ క్షేత్రం నుంచి వైదొలిగింది. ప్రస్తుతం ఇది మెల్లగా గ్రీస్‌లోని నాటో (NATO) స్థావరమైన క్రెటె వైపు మరమ్మతుల కోసం ప్రయాణిస్తోంది. ఎర్ర సముద్రం మీదుగా సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం శత్రువుల దాడి కాదు, నౌక లోపల సంభవించిన భారీ అగ్నిప్రమాదమే. యుద్ధం కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రధాన నౌక వెనుదిరగడం అమెరికా నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

30 గంటల భీభత్సం!

మార్చి 12వ తేదీన ఈ భారీ నౌకలోని లాండ్రీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెంటగాన్ వర్గాలు ఈ ప్రమాదం తీవ్రతను తగ్గించి చూపించిన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భయంకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ అగ్నికీలలు ఏకంగా 30 గంటల పాటు ఆగకుండా మండుతూనే ఉన్నాయి. ఒక అత్యున్నత సాంకేతికత కలిగిన నౌకలో మంటలను ఆర్పడానికి ఇంత సుదీర్ఘ సమయం పట్టడం ఆ నౌకలోని ఫైర్ సేఫ్టీ వ్యవస్థలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

600 మంది సైనికుల బెడ్లు దగ్ధం!

ఈ ప్రమాదంలో ఇద్దరు సైలర్లకు గాయాలవ్వగా, ఆస్తి నష్టం ఊహించని స్థాయిలో జరిగింది. నౌకలోని సుమారు 600 మంది సిబ్బందికి సంబంధించిన బెడ్లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అంటే వందలాది మంది సైనికులు ఇప్పుడు నివసించడానికి సరైన వసతి లేని పరిస్థితి నెలకొంది. అందుకే తక్షణం చేయగలిగిన మరమ్మతులు పూర్తి చేసుకోవడానికి క్రెటెలోని సౌద బేకు ఈ నౌకను తరలిస్తున్నారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకలు మాత్రం ఇప్పటికీ యుద్ధ క్షేత్రంలోనే ఉండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

13 బిలియన్ డాలర్లతో తయారైన ‘జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌’ వంటి నౌక, ఒక అగ్నిప్రమాదం వల్ల ఇలా యుద్ధం నుంచి తప్పుకోవడం అమెరికా ప్రతిష్టను దెబ్బతీసే అంశమే. శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న అగ్రరాజ్యం, తన సొంత నౌకల్లోని అంతర్గత భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది. యుద్ధ విమానాల రక్షణ లేకుండా ఈ నౌక ఇప్పుడు ఒంటరిగా గ్రీస్ వైపు వెళ్తుండడాన్ని బట్టి దాని బలహీనతను చాటిచెబుతోంది. మరమ్మతులు ముగించురొని ఇది మళ్లీ ఎప్పుడు యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News