ఆర్థిక ఇబ్బందులా.. జ‌గ‌న్ అంటే నిర్ల‌క్ష్య‌మా..?

పార్టీ అధినేత జగన్ బలవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అందుకే వారు కూడా అయిష్టంగానే ఈ కార్యక్రమాన్ని మమ అనిపించే దిశగా నడిపించారని విశ్లేషకులు భావిస్తున్నారు.;

Update: 2025-12-17 15:30 GMT

వైసీపీ నేత‌ల‌ పరిస్థితి ఇబ్బందుల్లో పడిందా? ఆర్థికంగా నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారా? అంటే ఒకింత ఆశ్చర్యకర పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా వైసిపి నాయకులు ఉద్యమాలు నిర్వహించారు. నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు కూడా చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాల్లో సహజంగా ఏ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్నారు.. అనే దాన్ని ప్రతిబింబించేలాగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయాలి.

అదేవిధంగా ఆయా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా పేర్కొనాలి. కానీ, చిత్రమేమిటంటే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వైసీపీ ర్యాలీలో అన్ని బ్యానర్లు కూడా గత ఎన్నికలకు ముందు రూపొందించిన వాటిని ప్రదర్శించడం. నిజానికి ఫ్లెక్సీలకు మహా అయితే ఓ పదివేల రూపాయలు ఖర్చవుతుంది. మరి ఆ మాత్రం కూడా నాయకుల దగ్గర సొమ్ము లేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఎందుకు ఖర్చు చేయాలని అనుకున్నారా తెలియదు. కానీ గత ఎన్నికల సమయంలో `వైసీపీకే మీ ఓటు` `జగన్కే మీ ఓటు` అని రాసిన ఫ్లెక్సీలను బ్యానర్లను పట్టుకుని నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

వ‌చ్చిన‌ వారికి కూడా ఇలాంటి బ్యానర్ లనే ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూడాలి? నాయకుల దగ్గర సొమ్ము లేదని భావించాలా లేకపోతే పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని అనుకోవాలా? అనేది ప్రశ్న. నిజానికి ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర అయింది. ఇంతలోనే నాయకుల దగ్గర సొమ్ము లేదని అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అనేది ఆలోచిస్తే ఈ కార్యక్రమాన్ని నాయకులు ఇష్టంగా అయితే నిర్వహించలేదని స్పష్టమవుతోంది.

పార్టీ అధినేత జగన్ బలవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అందుకే వారు కూడా అయిష్టంగానే ఈ కార్యక్రమాన్ని మమ అనిపించే దిశగా నడిపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. లేకపోతే, కనీసం ఒక పదివేల రూపాయలు ఖర్చుపెట్టి ఆమాత్రం కొత్తగా బ్యానర్లు రూపొందించలేరా ఫ్లెక్సీలు కట్టలేరా అనేది ప్రశ్న. వాస్తవానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గత నెలలోనే పూర్తిచేయాలని భావించారు. అయితే ఎక్కడికక్కడ నాయకులు ఉదాసీనంగా వ్యవహరించడం, పార్టీ అధిష్టాన పై ఉన్న ఆవేదన కావచ్చు ఆవేశం కావచ్చు ఏదైనా ఏ కారణంతో అయినా నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

దీంతో ఇటీవ‌ల ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్.. సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీని విజయవంతం చేయాలని ఆయన తేల్చి చెప్పారు. కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు నాయకులకు తీవ్రంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాయకులు `చేస్తే చేశాం` అన్నట్టుగా వ్యవహరించి పాత బ్యానర్లు పాత ఫ్లెక్సీలతోనే ఈ కార్యక్రమాన్ని నడిపించడం కనిపించింది. దీంతో పార్టీ పెట్టుకున్న లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News