మస్క్ సంపద 852 బిలియన్ డాలర్లు.. ప్రపంచంలోనే నెంబర్ వన్
స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ డీల్ తో రాకెట్స్, ఏఐ, సోషల్ మీడియా, స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి.;
స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ విలీనం ఎలన్ మస్క్ సంపదను అమాంతం పెంచింది. రెండు కంపెనీల విలువ 1.25 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఎలన్ మస్క్ సంపద 852 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఒక్క డీల్ తోనే మస్క్ సంపదకు 84 బిలియన్ డాలర్లు తోడయ్యాయి. ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్, ఎక్స్ ఏఐ రెండూ వేర్వేరు కంపెనీలు. ఇక నుంచి ఒకే కంపెనీ. రెండింటినీ ఎలన్ మస్కే స్థాపించారు. రెండింటినీ ఒక్కటి చేయడం ద్వారా చాలా సమస్యలను అధిగమించి, కీలక అంశాలపై పనిచేయడానికి దోహదమవుతుంది. ఈ విలీనం ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద డీల్ గా చెబుతున్నారు. విలీనమైన కంపెనీ జూన్ నాటికి ఐపీవోగా రాబోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ ఐపీవో ద్వారా దాదాపు 50 బిలియన్ డాలర్లు సేకరించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్ ఎక్స్, ఎక్స్ ఏఐ విలీనంతో అంతరిక్ష పరిశోధనలో, ఉపగ్రహ నిర్వహణలో కంపెనీ మెరుగైన ప్రగతిని సాధించనుంది.
మస్క్ సంపద ఇలా పెరిగింది..
డాట్ కామ్ బబుల్ సమయంలో ఎలన్ మస్క్ సంపదకు పునాది పడింది . జిప్2 అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ కంపెనీని 1999లో 307 మిలియన్ డాలర్లకు అమ్మేశారు.ఈ సంస్థలో మస్క్ 22 మిలియన్ డాలర్లు ఆర్జించారు. ఆ తర్వాత ఎక్స్ డాట్ కామ్ స్థాపించారు. ఇదే సంస్థ ఆ తర్వాతి కాలంలో ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేపాల్ గా మారింది. ఈ సంస్థను ఈబే సంస్థ 2002లో 1.5 బిలియన్ కు కొనుగోలు చేసింది. ఇందులో దాదాపు 180 మిలియన్ డాలర్లను మస్క్ సంపాదించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ తో మస్క్ సంపద అమాంతం పెరిగింది. టెస్లా కంపెనీలో మొదట్లో మస్క్ పెట్టుబడిదారుగా ఉన్నారు. ఈ తర్వాత సీఈవో అయ్యారు. మస్క్ నాయకత్వంలో కంపెనీ పురోగతి స్టాక్ ప్రైస్ ను భారీగా పెంచింది. దీంతో 2024 నాటికి మస్క్ సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. 2022లో స్పేస్ ఎక్స్ స్థాపించారు. దీని విలువు దాదాపు 800 బిలియన్ డాలర్లు. ఇందులో మస్క్ వాటా దాదాపు 336 బిలియన్ డాలర్లు.
ఒకే గొడుగు కిందకి..
స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ డీల్ తో రాకెట్స్, ఏఐ, సోషల్ మీడియా, స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి. అంతరిక్ష పరిశోధనలో ఏఐ వినియోగం మస్క్ దీర్ఘకాల దృష్టిని సూచిస్తోంది. అదే సమయంలో ఏఐ పోటీలో నిలబడాలంటే పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రెండు కంపెనీలను విలీనం చేసి.. ఐపీవో ద్వారా నిధులు సేకరించే యోచనలో మస్క్ ఉన్నట్టు తెలుస్తోంది. విలీన నిర్ణయం రెండు కంపెనీల లక్ష్యసాధనలో కేవలం రెండో చాప్టర్ కాదని, రెండో పుస్తకమని స్పేస్ ఎక్స్ పేర్కొంది. విలీనం రెండు కంపెనీల అభివృద్ధికి తోడ్పడనుంది. స్పేస్ ఎక్స్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ సాధిస్తే.. ఎక్స్ ఏఐకు స్పేస్ ఎక్స్ ఇన్ఫ్రాతోపాటు నిధుల సమీకరణ కూడా సులభం అవుతుంది. తద్వారా ఏఐ పోటీలో ముందు వరుసలో ఉండగలుగుతుంది. ఏఐ పురోగతిలో డేటా సెంటర్లది కీలకపాత్ర. కానీ డేటా సెంటర్లకు పెద్ద ఎత్తున నీరు, పవర్ కావాలి. అయితే భవిష్యత్తులో ఈ ఖర్చును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మస్క్ ప్రకటించారు. అది స్పేస్ లో సాధ్యమవుతుందన్నది మస్క్ అభిప్రాయం. అంతరిక్ష ఆధారిత ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలన్నది మస్క్ సుదూర లక్ష్యం. అయితే రెండింటినీ విలీనం చేయడం ద్వారా కల్చర్ డిఫరెన్సెస్ వస్తాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.