క్యాన్సర్ అంటే నో ఆన్సర్...నియంత్రించలేమా ?
దాని ప్రకారం చూస్తే పొగ తాగడం అన్నది నేరుగా డీ ఎన్ ఏ మీద ప్రభావం చూపిస్తుంది అని తేల్చింది. అలాగే అతి నీల లోహిత కిరణాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందై చెబుతోంది.;
దేశంలో కానీ ప్రపంచంలో కానీ భయంకరమైన వ్యాధి ఏది అంటే ఠక్కున చెప్పే సమాధానం క్యాన్సర్ అని. క్యాన్సర్ విషయంలో ఎవరైనా భీతిల్లుతారు. ఆ మాట వింటే హడలెత్తుతారు. ఎందుకంటే క్యాన్సర్ కి నో ఆన్సర్ అన్న భావన ఉంది. క్యాన్సర్ వచ్చింది అంటే ఇక వారి జీవితానికి సున్నా చుట్టేసినట్లే అన్న అభిప్రాయం ఉంది. అయితే క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనా కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులను నియంత్రించగలమని వైద్య నిపుణులు తరచూ చెబుతున్న మాటే. అవగాహన కలిగి ఉండడం ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి విముక్తి పొందగలరని అంటున్నారు. క్యాన్సర్ వచ్చినా దానిని జయించి మన కళ్ళ ముందు తిరుగుతున్న వారి జీవితాలను చూసి స్పూర్తి పొందాలని సూచిస్తున్న వారూ ఉన్నారు.
క్యాన్సర్ గురించి ఏమి తెలుసు :
ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రతీ ఏడాది ఏకంగా డెబ్బై లక్షల మందికి పైగా జనాలకు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే చాన్స్ మెండుగా ఉందని అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులు ఇస్తున్న ఒక కీలక సందేశంగా ఉంది. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకుంటే రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నది ఇంకా బాగా అర్ధం అవుతుందని అంటున్నారు. కొన్ని రకాలైన క్యాన్సర్లు కేవలం జీవన శైలి మార్పులు వల్ల అలాగే పర్యావరణంలో సంభవించే విపరిణామాల వల్ల కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్ వంటి వాటి వల్ల వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ మేరకు డబ్య్లూ హెచ్ ఓ ఈ మేరకు అంచనాకు కూడా వచ్చింది.
వీటికి ఇలా బ్రేక్ :
ఇక గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ కి టీకాల ద్వారా నివారించవచ్చు అని డబ్ల్యూ హెచ్ ఓ తెలియచేస్తోంది. అనేక రకాలైన ట్యూమర్లు కూడా క్యాన్సర్ లో ఉంటాయని వాటిని సిగరెట్ బీడీ చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా నిరోధించడం ద్వరా రాకుండా జాగ్రత్త పడవచ్చు అని సూచిస్తున్నారు. అనేక రకాలైన క్యాన్సర్ కేసులు ఉండొచ్చు కానీ వాటిని చాలా వరకూ నియంత్రించేవి అలాగే ముందస్తు జాగ్రత్తల వల్ల అదుపులో ఉంచేవి ఉన్నాయని వైద్య రంగానికి చెందిన సైంటిస్టులు చెబుతున్నారు.
నలభై శాతం నివారించొచ్చు :
వందకు నలభై శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చు అని నిపుణులు వెల్లడిస్తున్నారు. మానవ జీవితంలో డీఎన్ ఏ కీలక భూమిక పోషిస్తుంది, వయసు పెరిగే కొద్దీ అందులో జరిగే మార్పుల వల్ల లేదా వంశపారంపర్యంగా వచ్చే జన్యువుల ద్వారా కానీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే వీటిలో అవగాహన పెంచుకుంటే తగిన పరీక్షలు ఎప్పటికపుడు చేయించుకుంటే నివారించుకోగలమని అంటున్నారు. ఇక క్యాన్సర్ ప్రమాదం ఎలా పెరుగుతుంది దానిని ఎలా నివారించవచ్చు అన్న దాని మీద ప్రపంచ ఆరోగ్య సంస్థలో కీలక భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఒక విశ్లేషణను చేసింది.
వారికి క్యాన్సర్ ముప్పు :
దాని ప్రకారం చూస్తే పొగ తాగడం అన్నది నేరుగా డీ ఎన్ ఏ మీద ప్రభావం చూపిస్తుంది అని తేల్చింది. అలాగే అతి నీల లోహిత కిరణాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందై చెబుతోంది. అధిక బరువు అన్నది క్యాన్సర్ ముప్పుకి మరో కీలక కారణంగా వెల్లడించింది. అంతే కాదు ఎవరైతే పెద్దగా కష్టపడరో శారీరక శ్రమకు దూరంగా ఉంటారో వారికి క్యాన్సర్ ముప్పు ఉంటుందని తేల్చింది. ఇక వీటికి మించి వాయు కాలుష్యం అన్నది క్యాన్సర్ కణాలను ఫుల్ గా యాక్టివేట్ చేసి ఆ ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది.
వీటి వల్ల కూడా :
ఇక తొమ్మిది రకాలైన ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్ ముప్పుని తెస్తున్నాయని పేర్కొంది. హెచ్ వీపీ, కాలేయ క్యాన్సర్ కి దారి తీసే హెపటైటిస్ వైరస్ లు, కడుపులో అనేక సమస్యలను కలిగించే హెచ్. ఫైలోరీ బాక్టీరియా వంటివి ఉంటాయని తెలిపింది. టోటల్ గా ఈ విశెలషణ తేల్చింది ఏంటి అంటే ధూమ పానం, ఇన్ఫెక్షన్, మద్య పానం వంటి వాటి ద్వారా క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని. ఇందులో పొగ తాగడం వల్ల ఏటా 33 లక్షల కేసులు, ఇన్ఫెక్షన్ వల్ల 23 లక్షల కేసులు, మద్య పానం వల్ల 7 లక్షల కేసులు సంభవిస్తున్నాయి.
క్యాన్సర్ కి లింగ వివక్ష :
ఈ ప్రాణాంతక వ్యాది క్యాన్సర్ కి కూడా లింగ వివక్ష ఉంది. పురుషులలో ఒకలా మహిళలలో మరోలా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పురుషూల్లో అయితే 45 శాతం క్యాన్సర్ కేసులని నివారించవచ్చు, అదే మహిళలలో అయితే 30 శాతం కేసులను మాత్రమే నివారించవచ్చు. పురుషులలో క్యాన్సర్ కి పొగతాగడం ప్రదహాన కారణంగా ఉంటోంది. అయితే క్యాన్సర్ లో రకాలను తెలుసుకోవడం వాటిలో నివారించేవి ఏమిటో గుర్తించడం ద్వారా ప్రతీ ఏటా 70 లక్షల మందిని క్యాన్సర్ ద్వారా వచ్చే మరణం నుంచి బయట పడవచ్చు అని అంటున్నారు. మొత్తానికి ఆశావహంగా ఉండాలి, అదే సమయంలో అవగాహన కలిగి ఉండాలి, దానికి మించి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ఇవే క్యాన్సర్ ని దూరం చేసేవిగా నిపుణులు చెబుతున్నారు.