ఢిల్లీ వాయు కాలుష్యం వేళ.. చైనా నుంచి భారత్ కు ట్యుటోరియల్!
వాహన ఉద్గారాలని నియంత్రించడంలో బీజింగ్ విధానాన్ని వివరించిన జింగ్.. చైనా యూరో6 నిబంధనలకు సమానమైన అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలను (చైనా 6.ఎన్.ఐ) అవలంభించిందని పేర్కొన్నారు.;
భారతదేశానికి ఉన్న సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే.. దేశ రాజధానికి మాత్రం ప్రతి శీతాకాలం సమయంలో ఓ సమస్య రెగ్యులర్ గా పలకరిస్తూ, ఆందోళనకు గురిచేస్తూ, రోగాలను అప్పగిస్తూ ఉంటుంది! ప్రభుత్వాలు మారుతుంటాయి, పాలకులు మారుతుంటారు కానీ దేశ రాజధానిలో సామాన్యుడికి ప్రశాంతంగా గాలి పీల్చుకోలేని పరిస్థితి మాత్రం మారడంలేదు! ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటా వణికిస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రమాదకరంగా గాలి నాణ్యత, దట్టమైన పొగమంచు, ఫలితంగా శాసకోస వ్యాధుల పెరుగుదల.. ఇది భారతదేశ రాజధాని ఢిల్లీలోని ప్రతీ ఏటా శీతాకాలం కనిపించే దృశ్యాలు, వినిపించే విషయాలు! ఈ క్రమంలో.. ఒకప్పుడు ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరుగాంచిన చైనా రాజధాని బీజింగ్.. ఒక దశాబ్ధంలోనే దాని గాలి నాణ్యతను మెరుగుపరిచింది. అది ఎలాగో చైనా రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది.
అవును... ఒకప్పుడు పొగమంచు రాజధానిగా ఉన్న బీజింగ్.. దశాబ్ధ కాలంలోనే దాని గాలి నాణ్యతలో ఊహించని స్థాయిలో అన్నట్లుగా మార్పులు తీసుకొచ్చి, మెరుగుపరుచుకున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితులను తాము ఎలా ఎదుర్కొని, గట్టేక్కామనేది చెబుతూ చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ‘ఎక్స్’ వేదికగా సవివరంగా వెళ్లడించారు.
ఇందులో భాగంగా... వేగవంతమైన పట్టణీకరణ మధ్య వాయు కాలుష్యంతో పోరాటం చైనా, భారత్ రెండింటికీ తెలుసని మొదలుపెట్టిన జింగ్... వాహన ఉద్గారాలను నియంత్రించడానికి, పారిశ్రామిక పునర్నిర్మాణానికి సంబంధించిన చర్యలను వివరించారు. డిసెంబర్ 15న ఢిల్లీ, బీజింగ్ నగరాల్లోని గాలి నాణ్యత రీడింగ్ స్క్రీన్ షాట్ లు పంచుకున్నారు. ఇందులో ఢిల్లీలో ఏక్యూఐ 447 గా చూపించగా.. బీజింగ్ ఏక్యూఐ 67గా చూపించింది.
వాహన ఉద్గారాలను నియంత్రించే దశలు!:
వాహన ఉద్గారాలని నియంత్రించడంలో బీజింగ్ విధానాన్ని వివరించిన జింగ్.. చైనా యూరో6 నిబంధనలకు సమానమైన అత్యంత కఠినమైన ఉద్గార ప్రమాణాలను (చైనా 6.ఎన్.ఐ) అవలంభించిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. పాత, అధిక ఉద్గార వాహనాలను దశలవారీగా తొలగిస్తుందని తెలిపారు. అదే విధంగా ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగంగా స్వీకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా.. మెట్రో, బస్సు నెట్ వర్క్ లలో భారీ పెట్టుబడులతో పాటు లైసెన్స్ ప్లేట్ లాటరీలు, సరి-బేసి, వారపు రోజుల డ్రైవింగ్ పరిమితులు వంటి చర్యలను కూడా యూ జింగ్ ప్రస్థావించారు. పొరుగు ప్రాంతాల నుంచి కాలుష్యం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సమన్వయంతో కూడిన విధానం వల్ల ఈ ప్రయత్నాలు సాధ్యమయ్యాయని ఆమె నొక్కి చెప్పారు.
పారిశ్రామిక పునర్నిర్మాణం!:
ఇక పారిశ్రామిక పునర్నిర్మాణం గురించి ప్రస్థావిస్తూ జింగ్... 3,000కి పైగా భారీ పరిశ్రమలు మూసివేయబడ్డాయని లేదా ఇతర ప్రాంతాలకు తరలించబడ్డాయని చెబుతూ.. చైనాలోని అతిపెద్ద ఉక్కు తయారీదారుల్లో ఒకటైన షోగాంగ్ ను తరలించడం వల్లే పీల్చుకునే గాలిలో 20% కణాలను తగ్గించగలిగినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో.. ఇలా ఖాళీ చేయబడిన ఫ్యాక్టరీలను.. పార్కులు, కమర్షియల్ జోన్లు, సాంస్కృతిక సాంకేతిక కేంద్రాలుగా మార్చాలని సూచించిన రాయబార కార్యాలయం... మునుపటి షోగాంగ్ పారిశ్రామిక సముదాయాన్ని 2022 వింటర్ ఒలింపిక్స్ కు ప్రధాన వేదికగా మార్చిన విషయాన్ని అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.