కూటమి హిందూత్వ అస్త్రం- వర్కౌట్ అవుతుందా ?

దేశంలో రాజకీయాలు చూస్తే కనుక ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది.;

Update: 2026-02-06 06:12 GMT

దేశంలో రాజకీయాలు చూస్తే కనుక ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఉత్తరాదిన సున్నితమైన అంశాలు చాలా వరకూ తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందులో మత పరమైన అంశాలు భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో చూస్తే వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇది రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారందరికీ తెలిసిన విషయమే. 1990లలో దేశాన్ని కుదిపేసిన అయోధ్య ఇష్యూ కేవలం ఉత్తరాది రాష్ట్రలలోనే తీవ్ర ప్రభావం చూపించింది. ఇక బీజేపీ హిందూత్వ నినాదాలు కూడా ఉత్తర భారతం పరిధి పరిమితి దాటి వినిపించలేదు, వాటి ప్రభావం కూడా అంతగా కనిపించలేదు. ఇది చరిత్ర, ఇది విషయం. కానీ ఏపీలో టీడీపీ కూటమి ఇపుడు సరికొత్తగా పాత అస్త్రాలను ప్రయోగించాలని చూస్తోంది.

హిందూమతం అంటూ :

దాదాపుగా సగానికి పైగా మంత్రులతో కూటమి మిత్రులతో చంద్రబాబు ఒక కీలకమైన మీడియా సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలలో లడ్డూ కల్తీ జరిగింది అన్నది ప్రముఖమైనది. ఈ లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అన్నది ఆయన అంటున్న మాట. వైసీపీ అధినాయకత్వానికి హిందూ మతం మీద విశ్వాసం లేదని కూడా బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి వైసీపీ పాలనలో జరిగిన అనేక ఆలయాల విద్వంసం వంటి వాటిని కూడా ఉదహరించారు.

భ్రష్టు పట్టించాలని :

అంతే కాదు, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని నాటి ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టిందని ఒక విధంగా కుట్ర చేసిందని ఘాటైన ఆరోపణలనే బాబు చేశారు. ఇక హిందూ మతం గొప్పదనం గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు మన సంస్కృతి, మన కుటుంబ వ్యవస్థ పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి, విడాకుల ప్రస్తావన ఉండదు, ఎంతో భద్రత ఉంటుంది అని వివరించారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ వెంకటేశ్వరస్వామి వారే తమను ఆలయ పవిత్రత కాపాడాలని ఈ కార్యక్రమాలకు ఎంచుకున్నారని బాబు చెప్పడం విశేషం.

వదిలేది లేదంటూ :

తిరుమల స్వామి వారి ప్రసాదాంలో అపచారం చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని బాబు గట్టిగానే హెచ్చరించారు. ఈ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతే కాదు అన్ని వివరాలూ పూర్తి సమాచారం ప్రజలా ముందు ఉంచుతామని అంటున్నారు. ఒక చట్టపరంగా చూస్తే ఏక సభ్య కమిషన్ ని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి రాజకీయ పరంగా చూస్తే హిందూత్వ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకుని వెళ్ళి వైసీపీని గట్టిగానే ఇరికించాలని వ్యూహం ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

బీజేపీ వల్ల కానిది :

నిజానికి తెలుగు రాష్ట్రాలలో అందునా ఏపీ వంటి చోట హిందూత్వ నినాదాలు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయని అంటే సందేహమే సమాధానం అవుతుంది. హిందూత్వను రగిలించాలని బీజేపీ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అవి పెద్దగా ముందుకు సాగలేదు, ఏపీలో చూస్తే కులాల సమాహారంగా ఉంటుంది. రాజకీయాల్లో కులాల పాత్ర ఎక్కువ. ఆ ఈక్వేషన్స్ బాగా పండుతాయి కానీ మతపరమైన అంశాల పట్ల జనం అప్రమత్తగా ఉంటారు, జాగరూకతతోనే వ్యవహరిస్తారు. తిరుమల దేవుడు అంటే అందరికీ అచంచలమైన విశ్వాసం ఉంది. అదే సమయంలో దానికి రాజకీయాలకు ముడిపెడితే జనమంతా ఒకే వైపుగా పోలరైజ్ అవుతారు అన్న దానికి కూడా అవకాశాలు పెద్దగా లేవనే గత చరిత్ర చెబుతోంది.

అంతవరకే ఆగితేనే :

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అని తేలింది అని చెబుతున్నారు అలాగే ఏక సభ్య కమిషన్ వేసి తెర వెనక వారిని తెర ముందుకు తెస్తామని అంటున్నారు. అయితే చట్టపరంగా వీటి మీద చర్యలు తీసుకుని దానిని అక్కడితే ముగిస్తేనే మేలు అన్న మాట ఉంది. అలా కాకుండా ఇందులో హిందూత్వను జొప్పిస్తే కనుక అది ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీ వల్ల కానిది బలమైన పార్టీ యంత్రాంగం ఉన్న టీడీపీ హిందూత్వతో ముందుకు సాగితే ఏమైనా రిజల్ట్ ఉంటుందా అన్నది చూడాలి. ఒక్కటి మాత్రం నిజం రాజకీయాలు వేరు మతం వేరు, రెండింటినీ ముడి పెడితే మాత్రం దక్షిణాదిన అది చెల్లదని గత చరిత్ర అయితే స్పష్టంగా నిరూపించింది.

Tags:    

Similar News