పెళ్లికి వెళితే.. ‘మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాము’ ఫ్లెక్సీలతో స్వాగతం

సందర్భం ఏదైనా.. సీఎం, సీఎం అంటూ అరవటం.. కేకలు వేయటం వైసీపీ అభిమానులకు అలవాటుగా మారింది.;

Update: 2026-02-06 05:53 GMT

సందర్భం ఏదైనా.. సీఎం, సీఎం అంటూ అరవటం.. కేకలు వేయటం వైసీపీ అభిమానులకు అలవాటుగా మారింది. అదేమైనా తప్పా? అంటే తప్పేం లేదు. కాకుంటే.. కొన్ని సందర్భాలకు కొన్ని నినాదాలు అంతగా సూట్ కావు. అంతేకాదు.. అంతకు మించి అన్నట్లుగా కొన్ని ఫ్లెక్సీలు.. కటౌట్ లు.. వాటిల్లో ఉండే నినాదాలు.. బలప్రదర్శన జరిపే తీరు రోటీన్ కు కాస్తా భిన్నంగా ఉండటం కనిపిస్తుంది. తాజాగా శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు కొడుకు పెళ్లికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.




 


ఈ సందర్భంగా చోటు చేసుకున్న హడావుడికి మండలి ఛైర్మన్ మోషేను రాజు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పెళ్లి వేడుకకు ఏర్పాటు చేసిన డెకరేషన్ ఆగమాగం అవుతున్న వేళ.. ఆయన మైకు అందుకొని దయచేసి అల్లరి చేయొద్దంటూ మైకులో పదే పదే విన్నవించుకోవాల్సిన పరిస్థితి. హెలిప్యాడ్ నుంచి పెళ్లి మండపం వరకు.. పెళ్లి మండపం హాలు మొదలుకొని బయటకు వచ్చే వరకు నాన్ స్టాప్ హడావుడిని చూస్తే.. వచ్చింది పెళ్లికా? బలప్రదర్శనకా? అన్న సందేహం కలుగకమానదు.

మోషేను రాజు కొడుకు పెళ్లి కోసం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ లో వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద జగన్ అందులో నుంచి దిగిన వెంటనే.. సీఎం.. సీఎం అంటూ పలువురు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా.. కొందరు ప్రదర్శించిన ప్లకార్డులు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఆ కుర్చీ పెట్టిందే.. ఆ కుటుంబం కోసం రా’ అని ఒకదాంట్లోఉంటే.. ‘మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాము’ అంటూ మరో ఫ్లెక్సీలో పేర్కొన్నారు. సదరు ఫ్లెక్సీలో 2027-29 అన్న ఇయర్ మార్కుతో పాటు దాని పక్కనే ఫైర్ ఫోటోను అచ్చేయటం గమనార్హం. సదరు ఫ్లెక్సీలో జగన్ ఫోటో పైన మహేశ బాబు ఫోటో కూడా ఉండటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

హెలిప్యాడ్ మొదలు పెళ్లి మండపం వరకు రోడ్డుకు ఇరువైపులా జగన్ నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి కారులో వెళ్లిన జగన్ కు.. కొందరు కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ టూవీలర్ల మీద ఒక కాన్వాయ్ గా సాగారు. పెళ్లి మండపం వద్ద అమర్చిన బ్యారికేడ్లకు పలువురు జగన్ అభిమానులుకిందపడిపోయారు. పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తెల్ని ఆశీర్వదించి వెళుతున్న వేళలో.. సీఎం.. సీఎం.. జైజగన్ అంటూ నినాదాలు చేయటం కనిపించింది. పెళ్లి వేదిక మీద నుంచి జగన్ కిందకు దిగుతున్న వేళలో.. నెలకొన్న హడావుడి దెబ్బకు అక్కడ ఏర్పాటు చేసిన డెకరేషన్ చెల్లాచెదురవుతున్న పరిస్థితుల్లో మోషేనురాజు మైకు తీసుకొని అల్లరి చేయొద్దని కోరాల్సిన పరిస్థితి. పెళ్లి కోసం వచ్చినప్పుడు.. సింఫుల్ గా వచ్చి అంతే సింఫుల్ గా వెళితే సరిపోతుంది కదా? అందుకు భిన్నంగా ఇంత హడావుడా? అన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం.

Tags:    

Similar News