రాజ్యసభలో ప్రధాని మోడీ 100 నిమిషాల స్పీచ్.. వీటి సంగతేంటి?
అదే సమయంలో విపక్ష నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై పలు వ్యాఖ్యలు చేశారు.;
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరు తెలిసిందే. తాను చెప్పాలనుకున్న విషయాల్ని నాన్ స్టాప్ గా చెబుతారు కానీ.. తనను అదే పనిగా ప్రశ్నించే ప్రశ్నలను అస్సలు పట్టనట్లుగా.. తనకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించే ధోరణి కొత్తేం కాదు. ఏళ్లకు ఏళ్లుగా చూస్తున్నదే. ఈ తీరును మరోసారి రిపీట్ చేశారాయన. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రసంగించిన ప్రధాని మోడీ.. లోక్ సభలో కాకుండా రాజ్యసభను వేదికగా చేసుకున్నారు. దాదాపు వంద నిమిషాల పాటు ప్రసంగించిన మోడీ..తాము చేస్తున్న పనులు.. సాధించిన విజయాల్ని ప్రస్తావించిన ఆయన.. ఇటీవల కాలంలో ఆయన్ను ఉద్దేశించి విపక్ష నేతలు సంధిస్తున్న ప్రశ్నల్లో ఏ ఒక్కదానిని ప్రస్తావించింది లేదు. పరోక్షంగా సమాధానాలు ఇచ్చింది లేదు.
అదే సమయంలో విపక్ష నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తననేమీ చేయలేదని.. ఎన్నికల్లో వరుస ఓటములను జీర్ణించుకోలేక.. ఆ పార్టీ తనపై విద్వేష ప్రచారం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన భాష కాస్తంత కటువుగా ఉండటం గమనార్హం. లోక్ సభలో అంతరాయం కలిగించటం ద్వారా పేద, గిరిజన రాష్ట్రపతిని.. రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందన్నారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి బిట్టూను ద్రోహిగా పేర్కొనటం ద్వారా సిక్కులను రాహుల్ అవమానించారన్నారు. తన లాంటి పేద వ్యక్తి అత్యుననత స్థానానికి చేరుకొని.. దాన్నికొనసాగించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని.. దేశంతోని కోట్లాది మంది తల్లులు.. సోదరీమణులు.. పేదల ఆశీస్సులు ఉన్నంతవరకు తననేమీ చేయలేరన్నారు.
సంపన్న దేశాలూ అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుంటే.. మనం మాత్రం ఇక్కడి వారి కోసం కోర్టులపైనా ఒత్తిడి తెస్తున్నామన్నారు. రాజకీయ కక్షల కారణంగా కాళ్లు కోల్పోయిన సదానందన్ మాస్టర్ ఎన్నడూ తప్పుడు భాష వాడలేదని.. ఆయననూ విపక్షాలు అవమానించాయన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని.. దక్షిణార్థ గోళ దేశాల గొంతుకగా మన దేశం మారిందన్న మోడీ.. ఇటీవల కాలంలో పలు దేశాలతో తొమ్మిది వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నామన్నారు.
అమెరికా ఒప్పందాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోందన్న ఆయన.. ఈ డీల్ లో మోడీ సర్కారు అమెరికా ఒత్తిడికి తలొగ్గారని.. అమెరికా ప్రయోజనాలు తప్పించి భారత ప్రయోజనాల్ని అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలకు ఆధారాలతో సమాధానాలు చెప్పలేదంటున్నారు. అంతేకాదు.. ఎప్ స్టీన్ ఫైల్స్ లో మోడీ పేరు ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంటే ఆ అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించలేదు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణె రాసిన పుస్తకం మీద జరుగుతున్న రచ్చకు ఎలాంటి సమాధానం లేదు. రాజకీయఅంశాల్ని.. తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు వేదికగా తన ప్రసంగాన్నిమార్చుకున్న ప్రధాని మోడీ.. తన మీద వస్తున్న విమర్శలు.. ఆరోపణలకు కూడా బదులు ఇచ్చి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అలా చేస్తే.. ఆయన నరేంద్ర మోడీ ఎందుకు అవుతారు?