తెలంగాణలో నీకు రాజకీయ దుకాణం ఎక్కడిది? పవన్ కళ్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి సెటైర్ల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ సెంటర్ స్టేజ్‌లోకి వచ్చింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.;

Update: 2026-02-06 06:17 GMT

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ సెంటర్ స్టేజ్‌లోకి వచ్చింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై గతంలో పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనకు ఇక్కడ రాజకీయ స్థానం లేదని తేల్చి చెప్పారు.

పాత గాయాలను కెలికిన కోమటిరెడ్డి

గతంలో కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. “తెలంగాణ వాళ్ల దిష్టి తగిలే కోనసీమకు కష్టాలు వచ్చాయని పవన్ అన్న మాటలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. పదేళ్ల కిందట గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ వాళ్లు అసూయపడ్డారని మాట్లాడటం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే” అని ఆయన అన్నారు. తెలంగాణపై విషం చిమ్మే వారికి ఇక్కడ పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

‘బీజేపీ దుకాణమే లేదు.. జనసేనకు ఎక్కడి చోటు?’

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన-బీజేపీ పొత్తుపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “తెలంగాణలో అసలు బీజేపీ దుకాణమే మూతపడింది. ఆ పార్టీకే దిక్కులేదు.. ఇక పవన్ కళ్యాణ్ వచ్చి చేసేదేముంది?” అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం కాకుండా కేవలం భక్తుడిగా కొండగట్టు వచ్చి అంజన్నను దర్శించుకుని వెళ్లిపోతే పవన్‌కు మంచిది. అంతకుమించి ఇక్కడ ఆయనకు పని లేదు అని ఎద్దేవా చేశారు.

సినిమా ప్రదర్శనలపై హెచ్చరిక

పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన సినిమాల ప్రదర్శనపై ప్రభావం ఉంటుందని కోమటిరెడ్డి గతంలోనూ హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే థియేటర్ల వద్ద నిరసనలు తప్పవని అప్పట్లో పవన్ పై విరుచుకుపడ్డారు.

వేడెక్కిన రాజకీయం

మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన రైతుల కష్టాలను ఉద్దేశించి అన్న మాటలను రాజకీయంగా వాడుకుంటున్నారని జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల ముంగిట పవన్ ఎంట్రీపై కాంగ్రెస్ వర్సెస్ జనసేన వార్ ఇప్పుడు తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది.

Tags:    

Similar News