బాలయ్య 'బసవతారకం' ఆస్పత్రిపై కవిత సంచలన వ్యాఖ్యలు..
బసవతారకం ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించే అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బసవతారకం ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించే అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములను రాయితీపై తీసుకున్న ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
25 శాతం పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ భూములను తీసుకున్నారని కవిత పేర్కొన్నారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో పేదలు వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తే కనీసం గేటు లోపలికి కూడా అనుమతించని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.
బసవతారకం, అపోలో, యశోద వంటి ఆస్పత్రుల్లో పేదలకు 25 శాతం ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించిందని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, ఆస్పత్రుల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందించే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎండాకాలం నుంచి ‘భైరవ’ బస్సుతో పాదయాత్ర
ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు రాబోయే ఎండాకాలం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేస్తున్నామని, దానికి ‘భైరవ’ అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీమ్ సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తోందని కవిత ఆరోపించారు. అయితే తాను వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని, లైట్ తీసుకుంటున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలు లేదా తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడితే మాత్రం తాను కూడా తప్పకుండా స్పందించి సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
బతుకమ్మకు గిన్నిస్ రికార్డు లక్ష్యం
2027 దసరా నాటికి బతుకమ్మ పండుగను గిన్నిస్ రికార్డులోకి ఎక్కించేలా భారీ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కవిత తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ ఉద్దేశమన్నారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ
రాబోయే రాజకీయ ఎన్నికలపై కూడా కవిత కీలక ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ముస్లిం మైనారిటీ అభ్యర్థిని పోటీకి దింపాలని భావిస్తున్నట్లు కవిత తెలిపారు. మరోవైపు ఖమ్మం–వరంగల్–నల్గొండ ఎమ్మెల్సీ స్థానాల్లో తమ పార్టీ మద్దతు కోరుతూ పలువురు సంప్రదిస్తున్నారని చెప్పారు. అయితే ఈ స్థానాల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
పేదలకు ఉచిత వైద్యం, బతుకమ్మకు ప్రపంచ గుర్తింపు, పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లడం, రాబోయే ఎన్నికల్లో పోటీ వంటి అంశాలపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.