పల్లె పోరు: మూడో దశలోనూ కాంగ్రెస్‌దే హవా.. !
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశలోనూ కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధించింది. మొత్తం మూడు విదతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొలి రెండు దశల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగించింది.;
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశలోనూ కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధించింది. మొత్తం మూడు విదతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొలి రెండు దశల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగించింది. భారీసంఖ్యలో పంచాతీయలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా బుధవారం జరిగిన మూడోదశ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుకుంది. తుది దశలో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు 1300 పైచిలుకు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. మద్దతు దారులు తుది విడత ఎన్నికల్లో 625 పైచిలుకు పంచాయతీలను దక్కించుకున్నారు. మరో ప్రతిపక్షం బీజేపీ కేవలం 105 పంచాయతీలకు మాత్రమే పరిమితం అయింది.
ఇక, తొలి రెండు దశల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు భారీ విజయాన్నే నమోదు చేయడం విశేషం. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ సీట్లు దక్కాయి. నగరాలతో పోల్చుకుంటే.. పల్లెల్లో హస్తానికి మద్దతు లభించింది. అయితే.. రెండేళ్ల పాలన నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుందని..అది తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేసినా.. ఆ అంచనా తారుమారైంది. దీంతో తొలిదశ పంచాయతీ పోరు నుంచే కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకుంది. తొలిదశలో 2331 పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకుంది. రెండో దశలో 2246 స్థానాలతో తన హవాను కొనసాగించింది.
ఇదేసమయంలో పల్లెల్లో తొలినాళ్లలో పట్టుబిగించిన బీఆర్ ఎస్.. తాజా పంచాయతీ పోరులో మాత్రం వెనుకబడిందనే చెప్పాలి. తొలి దశలో 1168, రెండో దశలో 1188 మంది మద్దతు దారులు విజయం దక్కించుకున్నారు. ఇక, మూడో దశలో మాత్రం భారీగా వెనుకబడింది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడింది. పార్టీకి ఒకప్పుడు పల్లెలు అండగా ఉండగా రాను రాను ఈ ప్రభావం తగ్గుతుండడం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తుది దశలో మరింత వెనుకబడిన పరిస్థితి గులాబీ దళంలో కలవరానికి దారి తీసింది.
బీజేపీ పరిస్థితి దీనం..
పంచాయతీ పోరులో బీజేపీ పరిస్థితి దీనంగా మారింది. తొలి దశనుంచి తుది దశ వరకు కమలం పార్టీ మద్దతు ఆశించిన మేరకు పల్లెలలను కైవసం చేసుకోలేక పోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది. తొలిదశలో 189, రెండో దశలో 268 పల్లెల్లో మాత్రమే బీజేపీ మద్దతు దారులు విజయం దక్కించుకున్నారు.