పదిహేనేళ్ళు...బూమరాంగ్ అవుతుందా ?

ఏపీలో టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలలో పెద్దన్నగా టీడీపీ ఉంది. తరువాత వరుసలో జనసేన, మూడవ పార్టీగా బీజేపీ ఉంది.;

Update: 2026-02-07 17:30 GMT

ఏపీలో టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలలో పెద్దన్నగా టీడీపీ ఉంది. తరువాత వరుసలో జనసేన, మూడవ పార్టీగా బీజేపీ ఉంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో జట్టు కట్టి మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మరి కొద్ది నెలలలో రెండేళ్ళ పదవీ కాలం పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇదిలా ఉంటే తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కనీసం పదిహేనేళ్ళ పాటు అయినా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. ఇపుడు అదే మాటను మంత్రి నారా లోకేష్ గుర్తు చేస్తున్నారు.

పవనన్న చెప్పారు :

కనీసంగా మూడు టెర్ములు కూటమి పొత్తులు కొనసాగాలని కూటమి అధికారంలో ఉండాలని పవన్ అన్న చెప్పారు అని తాజాగా జరిగిన టీడీపీ బూత్ మేనేజ్మెంట్ సమావేశంలో సమావేశంలో నారా లోకేష్ చెప్పారు. ఏపీ గాడి తప్పిందని అంత సమయం ఉంటేనే తప్ప రాష్ట్రం దారిలోకి రాదని లోకేష్ అన్నారు. విడాకులు లేవు, మిస్ ఫైర్స్ అంతకంటే లేవు, అంతా కలసి కూటమిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని లోకేష్ క్యాడర్ కి చెప్పారు.

సమస్యలు ఉంటే కనుక :

మూడు పార్టీలు కలసికట్టుగా గ్రామ స్థాయి నుంచి పనిచేయాలి. సమస్యలు ఉంటే కనుక సర్దుబాటు చేసుకోవాలని లోకేష్ సూచించారు. పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ దీనిని అమలు చేయాలని ఆయన కోరారు. అంతా కలసి ఒక అవగాహనతో ముందుకు సాగాలని కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు అని గుర్తుంచుకోవాలని లోకేష్ అన్నారు.

లాంగ్ టెర్మ్ గానే :

ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ సమావేశాలలో లోకేష్ పదే పదే ఈ మాట చెబుతున్నారు. పవన్ చెప్పారని రిఫరెన్స్ ఇస్తూ కూడా చెబుతున్నారు. చెప్పడం వరకూ ఓకేగా ఉన్నా కూటమి అన్నాక తేడాలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ లో చూస్తే ఆధిపత్యం కోసం ఆరాటం ఉంటుంది. అసలు రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చేదే తమకు ఏమైనా కలిసి వస్తుందా అన్న దాని మీద. వర్తమాన రాజకీయాలు తీరుని చూసినపుడు పదిహేనేళ్ళ సుదీర్ఘ సమయం కలిసి ఉండాలని అనుకోవడం అత్యాశ గానే ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సయోధ్య అంతగా లేదని అంటున్నారు.

అనుకున్నది ఒకటైతే :

నిజానికి ఇలా చాలా ముందుగానే పార్టీ సమావేశాల్లో క్యాడర్ ని అప్రమత్తం చేయడం అవగాహన పెంచడం మంచిదే కానీ ఎక్కువ సార్లు అదే చెబుతూ పోతే క్యాడర్ లీడర్ కూడా నిరుత్సాహపడతారు అని అంటున్నారు. అవకాశాలు తమకు రావాలని కోరుకునే వారు, ఇక మార్పు ఉండదు, ఏకంగా దశాబ్దన్నర కాలం పాటు ఇలాగే ఇదే సెటప్ తో ఉండాలంటే పునరాలోచించే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. రాజకీయలు డైనమిక్ గా ఉంటాయి. ఎప్పటికపుడు మారిపోతూ ఉంటాయి. పైగా తమకు ఇపుడే అవకాశాలు రావాలని కోరుకునే వారూ ఉంటారు. నౌ ఆర్ నెవెర్ అన్న విధానమే ఎక్కువగా ఉంటుంది.

ఎప్పటికీ ఉండాలని :

ఇక ఇప్పటికే ఒక సామాజిక వర్గంతో పొత్తు ఉండడంతో అవకాశాలు అన్నీ అటు పోతున్నాయని టీడీపీలోనే బలమైన అదే సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అదే విధంగా గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు త్యాగరాజులుగా ఎప్పటికీ ఉండాలని అనుకోరు, ఇక నామినేటెడ్ పదవులను మూడుగా సర్దుకోవడం కూడా నచ్చని వారు ఉన్నారు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఐక్యంగా ఒకే పార్టీలో ఒకే నియోజకవర్గం నేతలను ఉంచలేని రాజకీయం సాగుతోంది. ప్రతీ చోటా వర్గ పోరు ప్రతీ పార్టీలో ఉన్న స్థితి ఉంది అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ముందుగానే అప్రమత్తం చేయడం అన్నది కూడా బూమరాంగ్ అవుతుందేమో అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News