చంద్రబాబు ఎలాంటి వారంటే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ఆయన రాష్ట్రంలో పర్యటించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ఆయన రాష్ట్రంలో పర్యటించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేంద్ర మంత్రి కామెంట్స్ సీఎంపై జాతీయస్థాయిలో ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
‘‘సాధారణంగా మనం అంతా ఇవాళ జీవిస్తూ రేపటి గురించి ఆలోచన చేస్తాం. కానీ సీఎం చంద్రబాబు రేపటి రోజులో జీవించి ఆ మర్నాటి రోజు గురించి ఆలోచన చేస్తారు.’’ అంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే 30-40 ఏళ్లకు అవసరమయ్యే క్వాంటం టెక్నాలజీని ఏపీకి తీసుకువచ్చారంటూ కొనియాడారు. అదేవిధంగా విశాఖను డీప్ సీ రీసెర్చ్ కేంద్రంగా మార్చేలా ప్రధాని మోదీతో ఎర్రకోట నుంచి ప్రకటన చేయించారని చెప్పారు. భారత్ ను సాంకేతిక పరంగా అత్యున్నతంగా మార్చడానికి నేషనల్ క్వాంటం మిషన్ సహా వేర్వేరు మిషన్లను ఆవిష్కరించుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అమరావతి దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీగా ఆవిష్కృతం అవుతోందని, • కేవలం క్వాంటం కంప్యూటర్లు మాత్రమే కాదు, క్వాంటం నిపుణులకు కూడా ఇది కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నేషనల్ క్వాంటం మిషన్ కోసం రూ.6 వేల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. రక్షణ, ఆరోగ్యం, ఆర్ధికం ఇలా వేర్వేరు రంగాల్లో వేగవంతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు అమరావతి క్వాంటం వ్యాలీ కేంద్రంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించేందుకు మనకు క్వాంటం నిపుణులు అవసరం అవుతారు. పెద్ద ఎత్తున పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాల్సి ఉంది. క్వాంటంలో ఇప్పటికే బీటెక్ కోర్సును అందిస్తున్నాం, త్వరలోనే ఎంటెక్ కోర్సును అందించేందుకు కార్యాచరణ చేపడతామంటూ కేంద్ర మంత్రి వెల్లడించారు. క్వూబిట్ నుంచి క్రయోజెనిక్స్ సహా వేర్వేరు అధునాతన సాంకేతిక అంశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
15 సంస్థలతో ఒప్పందాలు
దేశంలోని తొలి క్వాంటం వ్యాలీకి పునాది రాయి పడిన రోజే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి 15 భాగస్వామ్య సంస్థలతో ఎంవోయూలు కుదిరాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సెక్యూరిటీ, క్వాంటం సెన్సింగ్, క్వాంటం బయో ఫౌండ్రీ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. ఐక్యూ లీప్, ట్రై క్వాంటా ల్యాబ్స్, క్యూబిట్ ఫోర్స్, ఎస్ఆర్ఎం, క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. క్వాంటం హార్డ్‌వేర్ అభివృద్ధికి అత్యధికంగా 6 సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూలతో రాష్ట్రం నుంచే క్వాంటం సెన్సింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
హెల్త్‌కేర్ అప్లికేషన్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ అవసరాలకు స్వదేశీ క్వాంటమ్ టెక్నాలజీకి రూపకల్పన, నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు అనుగుణంగా హార్డ్‌వేర్ తయారీ, శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ అభివృద్ధి, అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ - రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశం చిక్కిందని అంటున్నారు. ఇక 15 సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకోవడం వల్ల యువతకు క్వాంటమ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇక అమరావతి క్వాంటం వ్యాలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి, ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారత్‌కు కూడా ఇదొక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు.
ఇవాళ క్వాంటం వ్యాలీ భవనాలకు మాత్రమే పునాది వేయటం లేదు..గ్లోబల్ క్వాంటం రెవల్యూషన్‌లో భాగమయ్యే నిపుణులకు కూడా పునాది వేసుకుంటున్నామని సీఎం అన్నారు. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందని, ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్ గా నిలిచిపోతుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్ధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఓ కీలకమైన ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చు కోలేకపోయింది. కానీ ఐటీ విప్లవంలో మనం ముందడుగు వేశాం. హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్ గా మారి ఫలితాలను ఇస్తోంది. హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.