రెండు సీట్లపై కన్ను.. పేర్ని వ్యూహం.. !
పేర్ని నాని. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం ఆయన ఒకటి కాదు.. రెండు నియోజకవర్గాలపై కన్నేసినట్టు వైసీపీలో చర్చ సాగుతోంది.;
పేర్ని నాని. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం ఆయన ఒకటి కాదు.. రెండు నియోజకవర్గాలపై కన్నేసినట్టు వైసీపీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం నియోజకవ ర్గాలకు ఇంచార్జ్‌లను నియమిస్తున్న నేపథ్యంలో పేర్ని తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలన్నది పేర్ని డిమాండ్. గత ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి ఉరఫ్ కిట్టు.. మచిలీపట్నం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు.
కానీ.. కూటమి హవాతో పేర్ని కిట్టు పరాజయం పాలయ్యారు. అయితే.. ప్రస్తుతం తండ్రితో కలిసి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కిట్టుకు ఈ సీటు ఖరారు చేయనున్నారు. మరి నాని పరిస్థితి ఏంటి? అంటే.. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తనకుమారుడికి చోటు కల్పించారు. కానీ.. మారుతున్న పరిస్థితులు.. రాజకీయ కారణాల నేపథ్యంలో పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మచిలీపట్నం పార్లమెంటు స్థానంపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ వైసీపీకి గ్యాప్ ఎక్కువగా ఉంది. దీంతో ఈ గ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బాలశౌరి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. జనసేన తరఫున విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సింహాద్రి చంద్రశేఖర్‌ను బరిలో నిలిపింది. ఆయన 5 లక్షల ఓట్లను సాధించారు. ఫలితంగా బాలశౌరి 2 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం దక్కించుకు న్నారు.
ఇక, వృత్తి రీత్యా వైద్యుడు కావడం, యాక్టివ్ పాలిటిక్స్‌పై సింహాద్రికి అంత ఇంట్రస్ట్ లేకపోవడంతో ఆయ న వైసీపీని దాదాపు వదిలేశారు. దీంతో మచిలీపట్నం ఎంపీ సీటు ఖాళీగానే ఉంది. దీనిని గమనించిన పేర్ని.. ఈ సీటుపై కర్చీఫ్ వేయాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా, తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని.. గెలుపు కూడా తథ్యమని ఆయన తన వారితో తరచుగా చెబుతున్నట్టు తెలిసింది. అయితే.. ఈ విషయంలో వైసీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.