నిమ్మగడ్డకు తప్పని నిరీక్షణ

Update: 2021-01-13 17:30 GMT
ఈనెల 18వ తేదీ వరకు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నిరీక్షణ తప్పదు. పంచాయితి ఎన్నికల నిర్వహణకు కమీషన్ ఇచ్చిన నోటిఫికేషన్ను కోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే సింగిల్ బెంచ్ నోటిఫికేషన్ను కొట్టేసిందో వెంటనే డివిజన్ బెంచ్ కు నిమ్మగడ్డ అప్పీలు చేశారు. ఇదే విషయమై 12వ తేదీన  విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం కేసును 18వ తేదీకి వాయిదా వేశారు.

 ఎలాగైనా సరే 12వ తేదీనే తీర్పు రాబట్టేందుకు కమీషన్ తరపున లాయర్ అశ్వనీకుమార్ ఎంతగా ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఇంత అర్జంటుగా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 18వ తేదీవరకు కేసు విచారణను వాయిదా వేస్తే కొంపలంటుకుపోతాయన్నట్లుగా అశ్వనీకుమార్ వినిపించిన వాదనను కోర్టు కొట్టేసింది. ఇప్పటికిప్పుడు సింగిల్ బెంచ్ తీర్పుపై విచారించాల్సినంత అవసరం ఏమీ లేదని సంక్రాంతి శెలవులు అయిపోయిన తర్వాత రెగ్యులర్ కోర్టులోనే విచారణ జరుపుతామని చెప్పి కేసును వాయిదా వేసింది ధర్మాసనం.

 మొత్తంమీద కోర్టు ఆలోచనను గమనిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినంత అవసరం లేదన్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే 17వ తేదీ నుండి కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరోవైపు పంచాయితీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించటం తమకు కష్టమే అని ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేమన్న ప్రభుత్వ వాదనతో సింగిల్ బెంచ్ కూడా ఏకీభవించింది.

ఎలాగైనా సరే ఎన్నికలను నిర్వహించాల్సిందే అన్న పంతంతో ఉన్న నిమ్మగడ్డ వెంటనే డివిజన్ బెంచ్ కు అప్పీలు చేశారు. అయితే డివిజన్ బెంచ్ కూడా ఈ కేసు విచారణలో అంత అత్యవసరం ఏమీ లేదని అభిప్రాయపడింది. దీన్నిబట్టే డివిజన్ బెంచ్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకే ప్రాధాన్యత ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ అభిప్రాయానికే కట్టుబడేట్లుంది. సరే ఫైలన్ గా కేసు విచారణలో ఏమవుతుందన్నది పక్కన పెట్టేస్తే 18 వరకు నిమ్మగడ్డకు నిరీక్షణ అయితే తప్పేట్లులేదు.
Tags:    

Similar News