విశాఖ స్టీల్ ప్లాంట్ ను వీఆర్ఎస్ లతో మూసేస్తారా?

Update: 2020-11-15 11:50 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ లో  వాలంటరీ రిటైర్మైంట్ స్కీమ్ (వీఆర్ఎస్) సంబంధించిన నోటీసులు బోర్డులపై దర్శనం ఇవ్వడం  ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొంతకాలకంగా ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోతుందనే కారణంతో కొందరినీ స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తొలగించడానికి    సిద్ధమవుతున్నారా..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ప్లాంటు అధికారులు మాత్రం వీఆర్ఎస్ అమలుపై  వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటులో నాణ్యమైన ఉత్పత్తికే చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో విస్తరణ పనుల కోసం చేసిన అప్పలకు వడ్డీ భారం , సుధూర ప్రాంతాల నుంచి ముడిసరుకు రావడంతో ఆర్థికంగా భారం అవుతోంది. దీంతో వీఆర్ఎస్ తెరమీదకు తెచ్చి క్రమంగా ఈ ప్లాంటును పోస్కో వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే చర్యలు చేపడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం స్టీల్ ప్లాంటులో స్టీల్ మెల్టింగ్ షాప్ లు రెండు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటి నుంచి పోస్కో కు అవసరమైన ఉక్కుని అందించలేమనే సాకు చూపి తాను స్వయంగా ఎస్ఎంఎస్ ప్లాంటు ఏర్పాటుకు  పోస్కో సిద్ధమవుతుందని ఐఎన్టీయూసీ నాయకుడు గంధం వెంకటరావు ఆరోపిస్తున్నారు. అదే జరిగితే మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంటును పోస్కో లో విలీనం చేసుకోవడం ఖాయమన్నారు.

గతేడాది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించారు. అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమై విశాఖ ఉక్కు కర్మాగారానికి పోస్కో వంటి దిగ్గజంతో భాగస్వామ్యం అవసరం అని అన్నారు. దీంతో అప్పుడు కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. పోస్కో కర్మాగారం స్టీల్ ప్లాంటులో ఏర్పాటు చేస్తే తాము వ్యతిరేకిస్తామని ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు వీఆర్ఎస్ నోటీసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అయితే వీఆర్ఎస్ విషయంపై స్టీల్ ప్లాంటు అధికారులు స్పందించారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగారం ఆర్థిక ఒడిదొడుగులను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే దీనికి వీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదని ప్లాంటు కార్పొరేషన్ కమ్యూనికేషన్ జనరల్ మేనేజర్ ఆర్పీ సింగ్ తెలిపారు. ఉద్యోగుల్లో కొందరు అనారోగ్యం, ఇతర సమస్యల కారణంగా ఎప్పటి నుంచో వీఆర్ఎస్ కోరుకుంటున్నారని, అటువంటి విన్నపాల నేపథ్యంలోనే వీఆర్ఎస్ విధివిధానాలను రూపొందించామన్నారు.  అయితే పోస్కోతో వైజాగ్ స్టీల్ ప్లాంటు ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకుందని, అది నాణ్యమైన ఉక్కు ఉత్పత్తుల కోసమేనని తెలిపారు.
Tags:    

Similar News