పదేళ్లుగా వీల్ చైర్ కే అంకితం.. విధిరాతను జయించిన ఆణిముత్యం
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్నారు.;
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఇప్పటికే ఎంతోమంది నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక యువతి దాదాపుగా పది సంవత్సరాలుగా వీల్ చైర్ కే పరిమితమై.. తన జీవితం అంతే అని అనుకోకుండా విధి రాతను ఎదురించి మరీ సివిల్స్ ఫలితాలలో 483వ ర్యాంకు సాధించి అందరికీ ఆశ్చర్యం కలిగించారు. ఇక నేడు అంతర్జాతీయ మహిళా సందర్భంగా ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల ఆధారంగా బయటపడ్డ ఈ యువతి ప్రతి ఒక్కరికి రోల్ మోడల్ అనే చెప్పాలి. సివిల్స్ రాయడం అంటే కష్టం.. మనతో కాదు. మనం సాధించలేం అనే వారికి ఈమె ఒక స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.
విధిరాతను ఎదురించిన యువతి..
కేరళకు చెందిన 30 సంవత్సరల అథిర.. బీడీఎస్ చదువుతుండగానే ఆక్సిడెంట్ జరగడంతో తల , వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. కదలలేని పరిస్థితి.. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా కోల్పోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని బీడీఎస్ పూర్తి చేసింది. ఎన్జీవో లో డిసెబిలిటీ వింగ్లో పనిచేయడం వల్లే తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, తన తల్లిదండ్రులు, సోదరి సహాయంతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని అథిర చెప్పుకొచ్చింది. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ యువతి నేడు ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ర్యాంకు అందుకని అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా సాధించిన విజయాన్ని సగౌరవంగా జరుపుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సక్సెస్ పై అథిర భావోద్వేగం..
ఇకపోతే తాను పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం గురించి ఆమె మాట్లాడుతూ భావోద్వేగం అయ్యారు.. దంత వైద్యురాలు కావాలన్నది నా కల . అందుకే విదేశాలలో ముఖ్యంగా ఫ్రాన్స్ లో ఎండీఎస్ చేయాలనుకున్నాను. కానీ ఈ ప్రమాదం నన్ను, నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. బహుశా ఈ ప్రమాదం జరిగి ఉండకపోతే నేను సివిల్స్ రాయాలన్న ఆలోచన గురించి ఒక్కసారి కూడా ఆలోచించేదాన్ని కాదేమో. పదేళ్ల క్రితం బెంగళూరులో బిడిఎస్ చదువుకునేటప్పుడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా అలాగే బయటకు వెళ్లాను.. అయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని అతలాకుతలం చేసింది .తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు సంవత్సరాల పాటు జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయాను. మొదట్లో వైద్యులు నేను బ్రతికి ఉన్నా.. మంచానికే పరిమితం అవుతానని చెప్పారు. కానీ వెంటిలేటర్ పై పోరాడుతున్నప్పుడే ఒకరోజు నా వేలు కదలడంతో వైద్యుల్లో నేను కోలుకోగలుగుతుందనే ఆశ మొదలైంది. అనుకున్నట్లుగానే నెమ్మదిగా నా శక్తినంత కూడతీసుకొని చక్రాల కుర్చీలో కూర్చోగలిగాను. ఆ తర్వాత చాలా రోజులపాటు చికిత్స కొనసాగింది .
నెమ్మదిగా నా జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది. చదువును కొనసాగించాలనుకున్నాను. అయితే ఈ ప్రమాదానికి ముందు మూడేళ్ల పాటు నేను చదువుకున్న విషయాలు ఏవి కూడా నాకు గుర్తులేవు. అయినప్పటికీ మళ్ళీ ఒక సంవత్సరం పాటు మొదటి నుంచి చదివాను. ఆపై ఫైనల్ పరీక్షలు రాసి బిడిఎస్ కోర్సు పూర్తి చేయగలిగాను. ఈ కఠిన సమయంలో నా చెల్లి, తల్లిదండ్రులు తోడుగా నిలిచారు" . అంటూ తన సక్సెస్ వెనుక పడ్డ శ్రమ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.