ఉమెన్ కాదు.. మల్టీ టాస్కర్!

ఆడపిల్ల పుట్టింది అంటే చాలు భారంగా భావించే సమాజంలో ఆడపిల్ల ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక మల్టీ టాస్కర్ అనే విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు.;

Update: 2026-03-08 05:35 GMT

ఆడపిల్ల పుట్టింది అంటే చాలు భారంగా భావించే సమాజంలో ఆడపిల్ల ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక మల్టీ టాస్కర్ అనే విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు. కోడి కూయక ముందే తెలవారకముందే నిద్రలేచే అమ్మ నిజంగానే మల్టీ టాస్కర్.. తల్లిగా, భార్యగా, కూతురిగా, కోడలిగా ఏకకాలంలో అన్ని బాధ్యతలు నెరవేర్చగల ఏకైక ఎక్స్పర్ట్. ఇంట్లో జీతం తీసుకోని .. రిటైర్మెంట్ అడగని గృహిణి.. కుటుంబాన్ని నడిపించే ఆర్థికవేత్త.. ఓపిక ఆమె బలం అయితే సహనం ఆమె ఆభరణం.. ప్రేమ పంచడంలో దైవానికి మించింది. అవకాశాల్ని అందిపుచ్చుకొని.. అడ్డంకులను దాటుకొని.. తమను నిరూపించుకొని ..ఈ ప్రపంచానికి వెలుగు నిచ్చే ప్రతి మహిళా కూడా ఒక మల్టీ టాస్కర్ అనే చెప్పాలి.

అసలైన మల్టీ టాస్కర్..

మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే కాలం నుండి బయటకు వచ్చి నేడు అంతర్జాతీయంగా గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. ప్రాంతీయంతో సంబంధం లేకుండా.. భాషతో పట్టింపు లేకుండా.. దేశవ్యాప్తంగా కాదు అటు ప్రపంచవ్యాప్తంగా.. రాజ్యాలను ఏలుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడపిల్ల అంటే అమాయకురాలు కాదు శక్తి అని నిరూపిస్తూ అన్నింటా తానై ఉంటూ అందరికీ అండగా నిలుస్తూ సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రథమ పాత్ర పోషిస్తున్నారు.

కుటుంబానికి అండగా.. సమాజ అభివృద్ధికై పోరాడుతూ..

మహిళా అంటే ప్రయాణించేదే కాదు అటు బైక్ ని మొదలుకొని విమానాన్ని కూడా అవలీలగా నడిపేస్తూ ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ.. ప్రాణం యొక్క విలువను అందరికీ నేర్పిస్తుంది. ఆడది లేనిదే సమాజమే లేదు అనేంతలా ప్రతి చోట తానే ఉంటూ ప్రతిక్షణం కంటికి రెప్పలా అటు కుటుంబాన్ని ఇటు కన్నబిడ్డలని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రతి మహిళకి వందనం.

ఇంతటి చేసిన మహిళకంటూ ఒక రోజున కేటాయించాలని ప్రపంచ దేశాలన్నీ కలిపి మార్చి 8వ తేదీని ఎంపిక చేసుకున్నాయి. అలా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల పట్ల గౌరవం, ప్రశంశ, ప్రేమ, మహిళల ఆర్థిక , రాజకీయ, సామాజిక విజయాలను జరుపుకోవడం ఈ రోజు యొక్క ప్రత్యేకత. వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రతి మహిళను గౌరవిస్తూ ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం అందించే రోజు..

2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్..

మరి ఈ 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏంటి అనే విషయానికి వస్తే.." గివ్ టు గెయిన్".. ప్రపంచవ్యాప్తంగా విరాళం ఇవ్వడానికి పిలుపు.. ఒకరికొకరు తోడుగా నిలబడడం.. మగవారితో సమానమైన జీతం.. గౌరవం ఇవ్వడం.. డబ్బు రూపంలోనే కాకుండా మనకున్న జ్ఞానాన్ని.. వనరులను పంచుకోవడం ద్వారా మహిళలను పైకి తీసుకురావడం.. మహిళలకు చదువు , శిక్షణ , మంచి అవకాశాలు కల్పించడం , మహిళలు అభివృద్ధి చెందితే మొత్తం సమాజమే పురోగమిస్తుంది అనేది ఈ ఏడాది సందేశం.

మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది?

మహిళా దినోత్సవం వెనుక ఒక పెద్ద పోరాటమే జరిగిందనే చెప్పాలి.. ఫిబ్రవరి 28 1909న అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తొలిసారి ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. జర్మనీకి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త క్లారా జెట్కిన్ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని ఆమె ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక ఆమె ప్రతిపాదనను అంగీకరించిన తర్వాత మార్చి 19 1911న మొదటిసారి జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ , ఆస్ట్రియా దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఒక మహిళలకు ఓటు హక్కు కల్పించాలని, పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కనిపించాలని.. డిమాండ్ చేస్తూ భారీ మెరుగు ర్యాలీలు కూడా నిర్వహించారు. అలా ఐక్యరాజ్యసమితి 1975లో దీనిని అధికారికంగా ప్రకటిస్తూ.. ప్రపంచమంతా మార్చి 8న జరుపుకోవాలని సూచించింది అలా అప్పటి నుంచి ఈ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Tags:    

Similar News