టీటీడీకి లేటయ్యే కొద్దీ.. 'కాంపిటీషన్' పెరుగుతోందిగా..!
| టీటీడీ పాలకమండలి ఏర్పాటుకు మరో నెల లేదా రెండు నెలలు పట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామపంచాయతీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయం ఆలస్యం కావచ్చని అంచనా. చైర్మన్ పదవికి నలుగురి పేర్లతో నివేదిక అందినట్లు సమాచారం. ఎన్నారై, ఆర్ఎస్ఎస్ నేతతో పాటు సీనియర్ నాయకులు, మహిళా ప్రతినిధులు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 52 మంది సభ్యులున్న బోర్డులో మరో 10 మందికి అవకాశం కల్పించవచ్చనే అంచనాలున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వ్యవహారం విషయంలో నిర్ణయం తీసుకునేందుకు దాదాపు మరో నెల రోజులు పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసినప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు ఉన్నాయి.ఈనెల లోనే అవి కూడా పూర్తికానున్నాయి. మొత్తంగా ఫలితం వచ్చేసరికి వచ్చే నెల మూడో తేదీ వరకు పట్టే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. తద్వారా ఏ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లేదు.
మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి కీలక అంశంలో ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అసలే లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి ఏర్పాటుకు ఖచ్చితంగా మరో నెల రెండు నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందన్నది టిడిపి వర్గాలు చెబుతున్న మాట. ఇదిలా ఉంటే ఆలస్యం అయ్యే కొద్ది పాలకమండలి చైర్మన్ పోస్ట్ సహా సభ్యుల విషయంలో కూడా పోటీ విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాలక మండల గడువు తీరకముందే పార్టీ అధినేతకు సుమారు నలుగురు పేర్లతో కూడిన నివేదిక అందిందని చెబుతున్నారు.
ఇక చైర్మన్ అభ్యర్థి విషయంలో ఈ నలుగురి నుంచే ఎంపిక చేస్తారా లేకపోతే కొత్తగా ఎవరినైనా ప్రతిపాదిస్తారా అనేది ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. మరోవైపు పాలకమండలి సభ్యులుగా కూడా చాలామంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డులో 52 మంది సభ్యులు ఉండగా సూపర్ న్యూమరీ విధానాల్లో మరో 10 మందిని ఈసారి ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. తద్వారా బోర్డులో పదవిని ఆశిస్తున్న అందరినీ సంతృప్తి పరచాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా కొందరు నాయకులు చెబుతున్నారు. ఇక చైర్మన్ రైస్ లో ఒక ఎన్నారై తో పాటు కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఈ పదవిని దక్కించుకునేందుకు టిడిపిలోని సీనియర్ నాయకుడు ఒకరు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. అలాగే ఒక మీడియాకు సంబంధించిన మహిళ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా ఉన్నారని అంటున్నారు. మహిళకు అవకాశం కల్పించాలన్న చర్చ కూడా నడుస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు. మొత్తంగా ఆలస్యం అయ్యే కొద్ది కూడా టీటీడీ బోర్డు విషయంలో కాంపిటీషన్ పెరుగుతోందని.. మరింత మంది నాయకులు సభ్యులుగా అవకాశం కోరుతున్నారని అంటున్నారు. కానీ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యం తప్పక పోవచ్చు అని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం పై సీఎం చంద్రబాబు భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందని కూడా చెబుతుండడం విశేషం.