భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం
| బెంగళూరులో కుటుంబ విభేదాలు దారుణ హత్యలకు దారితీశాయి. భార్య సునీత తన పుట్టింటి వారితో మాట్లాడటం ఇష్టంలేని క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్, ఆమెను హత్య చేసిన అనంతరం కుటుంబ సభ్యులపై కూడా కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఇంటికి పిలిపించి అత్త, బావమరదులు, మరదళ్లతో పాటు ఏడేళ్ల బాలుడిని హత్య చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
కుటుంబం అంటే అనుబంధాలు.. ఆప్యాయతలు.. ఒకరికొకరు తోడుగా నిలిచే నమ్మకం. భార్యాభర్తల మధ్య విభేదాలు.. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడం అత్యంత సహజం. కానీ వాటిని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి.. కక్షలు పెంచుకుని.. సొంత బంధువుల ప్రాణాలనే బలితీసుకునే స్థాయికి దిగజారితే ఎంతటి ఘోరం జరుగుతుందో బెంగళూరు ఘటన అద్దం పడుతోంది. అనుమానం.. ఆధిపత్య ధోరణితో నిండిన ఒక వ్యక్తి కిరాతకానికి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు బలవ్వడం తీవ్ర సంచలనం రేపుతోంది.
బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్, భార్య సునీతతో తరచూ గొడవపడేవాడు. భార్య తన పుట్టింటి వారితో మాట్లాడటం.. వారిని కలవడం అతడికి అసలు నచ్చలేదు.. వారి సంబంధాలను తెంచేసుకోవాలని ఆంక్షలు పెట్టేవాడు... ఈ క్రమంలో పెరిగిన విభేదాలు చివరకు ఆమెను హత్య చేసేంత భయంకరంగా మారాయి. కోపంతో భార్య సునీతను మట్టుబెట్టిన నిందితుడు.. అంతటితో ఆగక ఆమె కుటుంబంపై కూడా కక్ష పెంచుకున్నాడు.
ఒక్కొక్కరిని ప్లాన్ ప్రకారం తన ఇంటికి పిలిపించి దాడి చేశాడు. భార్య సునీత.. అత్త రూపవతి, బావమరదులు శివకుమార్, శంకర్, మరదళ్లు దివ్య, నళినిలను దారుణంగా హత్య చేశాడు. చివరకు ఏ పాపమూ ఎరుగని శంకర్ ఏడేళ్ల కుమారుడు పునీత్ కూడా ఈ రాక్షసత్వానికి బలయ్యాడు. కుటుంబంలో పెద్దల మధ్య ఉన్న గొడవలకు అమాయకపు నవ్వులతో తిరిగే ఒక చిన్నారి ప్రాణాలు తీయడం దారుణమనే చెప్పొచ్చు.
మనుషుల్లో పెరుగుతున్న అసహనం.. ఆధిపత్య ధోరణి ఎంతటి ప్రమాదకరమో ఈ దారుణం హెచ్చరిస్తోంది. భార్యను తన నియంత్రణలో ఉంచుకోవాలనుకోవడం.. బంధాలను తెంచేయాలని ఒత్తిడి చేయడం ఏమాత్రం సహించే విషయం కాదు... కుటుంబ సమస్యలను చర్చలు.. కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప.. కోపంతో ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ప్రేమతో వికసించాల్సిన బంధాలు ఇలా శవాల దిబ్బలుగా మారడం సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.