హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?
మహిళల పేరుతో సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయటం.. అందమైన అమ్మాయిల ఫోటోలతో వల వేయటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే సైబర్ నేరస్తుడు పవన్ కుమార్ ను ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
మహిళల పేరుతో సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయటం.. అందమైన అమ్మాయిల ఫోటోలతో వల వేయటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే సైబర్ నేరస్తుడు పవన్ కుమార్ ను ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడ్ని సైతం టార్గెట్ చేసి.. వలపు వల విసిరి దోచేసిన ఈ దుర్మార్గుడ్ని పోలీసులకు దొరికేలా చేసింది సదరు స్నేహితుడే. పవన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించిన వేళ.. బయటకు వచ్చిన అంశాలు పోలీసులకు సైతం షాక్ కు గురి చేసినట్లుగా తెలుస్తోంది.
ఇతగాడి చేతిలో మోసపోయి బాధితులుగా మారిన వారు సుమారు వెయ్యి మంది వరకు ఉన్నట్లుగా తేలింది. ఇప్పటివరకు 82 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ.25 లక్షల వరకు కొల్లగొట్టినట్లుగా పోలీసులు తేల్చారు. మొత్తంగా హనీట్రాప్ పేరుతో ఇతగాడు బాధితుల నుంచి కోట్లాది రూపాయిలు దోచినట్లుగా భావిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇతగాడి ట్రాప్ లో ఒక ఏసీపీ.. ఒక ఇన్ స్పెక్టర్ సైతం ఉన్న విషయాన్ని గుర్తించారు. సైబర్ నేరాలు.. హనీట్రాప్ లో చిక్కుకోవద్దంటూ ఈ నేరాలపై అవగాహన కల్పించే పోలీసులు సైతం బాధితులుగా మారటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలీసు వర్గాల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం పవన్ ట్రాప్ లో పడిన పోలీసు అధికారుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ ఇతగాడు ఇంతలా ఎలా మోసం చేశాడు? ఇంత మందిని ఎలా ట్రాప్ చేశాడన్న విషయంలోకి వెళ్లిన విచారణ అధికారులు విస్తుపోయే అంశాల్ని గుర్తించారు. మొత్తంగా 13 ఇన్ స్టా అకౌంట్లు.. 14 ఫేస్ బుక్ ఖాతాల్ని పవన్ కుమార్ ఓపెన్ చేసి.. వందలాది మందికి వల విసిరిన వైనాన్ని గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారే కాదు.. కెనడా.. టర్కీ.. పాకిస్తాన్.. దుబాయ్ ల్లోనూ ఇతగాడి బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు.
పవన్ చేతిలో మోసపోయిన వారిలో ఉద్యోగులు.. వైద్యులు.. లెక్చరర్లు.. గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్లు తేల్చారు. మరో షాకింగ్ నిజం ఏమంటే.. బాధితుల బలహీనతల్ని గుర్తించి చాటింగ్ పేరుతో వలపు వల విసిరే పవన్.. అవసరానికి తగ్గట్లే కచ్ఛితంగా అమ్మాయిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. అవతల ఉన్నది నిజంగానే అమ్మాయి అన్న విషయాన్ని నమ్మించేందుకు తన మాజీ ప్రియురాలిని రంగంలోకి దించినట్లుగా తేల్చారు. ఆమె సాయంతో వలపు వల విసిరేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో తమ ట్రాప్ లో పడిన వారిని.. తాను అమ్మాయి సోదరుడిగా చెబుతూ.. వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. లేనిపక్షంలో ప్రైవేటు ఫోటోలు.. వీడియోలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగటంతో..బాధితులు పెద్ద ఎత్తున డబ్బులు అతడు చెప్పినట్లే ఇచ్చేవారన్న విషయాన్ని గుర్తించారు.