ఇది మరో 'పిశాచి' కథ.. తండ్రిపై ప్రేమతో నాలుగేళ్లుగా ఫ్రీజర్‌‌లోనే మృతదేహం.. ముంబైలో గగుర్పొడిచే కథ

ప్రేమ అనుబంధాలు మనుషులను ఎంత దూరం తీసుకెళ్తాయో చెప్పడానికి సరికొత్త ఉదాహరణగా నిలిచే ఒక దిగ్భ్రాంతిరకర ఘటన ముంబైలో వెలుగుచూసింది.

Update: 2026-10-01 06:23 GMT

ప్రేమ అనుబంధాలు మనుషులను ఎంత దూరం తీసుకెళ్తాయో చెప్పడానికి సరికొత్త ఉదాహరణగా నిలిచే ఒక దిగ్భ్రాంతిరకర ఘటన ముంబైలో వెలుగుచూసింది. కంటికి నచ్చిన రూపాన్ని.. గుండెకు నచ్చిన బంధాన్ని వదులుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ కన్నతండ్రి మరణాన్ని తట్టుకోలేక.. ఆయన భౌతికకాయాన్ని ఏకంగా నాలుగేళ్ల పాటు ఇంట్లోని ఫ్రీజర్‌లోనే దాచిపెట్టుకున్న ఒక కుమార్తె కథ ఇప్పుడు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి, వేదనకు గురిచేస్తోంది. ‘పిశాచి’ సినిమాలో కూతురు చనిపోతే తండ్రి ఐస్ ఫ్యాక్టరీ ఫీజర్ లో దాచిపెడితే ఇప్పుడు తండ్రి చనిపోతే ఆయన్ను ముంబైలో ఫ్రీజర్ లో పెట్టేసింది కూతురు..

కలచివేసిన నిజం.. బయటపడిందిలా!

ముంబై పశ్చిమ ప్రాంతంలో ఒక ఇల్లు కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది. అయితే ఆ ఇంటి నుంచి సడన్‌గా తీవ్రమైన దుర్వాసన రావడం ప్రారంభమైంది. ఇరుగుపొరుగు వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టులయ్యారు. ఇంట్లోని ఒక పెద్ద ఫ్రీజర్ బాక్స్‌‌లో వృద్ధుడి మృతదేహం భద్రపరిచి ఉంది. విచారణలో ఆ మృతదేహం ఆ మహిళ తండ్రిదని.. ఆయన నాలుగేళ్ల క్రితమే కన్నుమూశారని తెలిసి అధికారులు దిగ్భ్రాంతి చెందారు. ఆశ్చర్యకరంగా ఆ ఇంటి బయట త్వరలోనే ఒక డేకేర్ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఉన్న ఒక బోర్డు కూడా లభించడంతో ఈ ఉదంతం మరింత మిస్టరీగా మారింది.

‘నాన్నను వదులుకోలేకపోయాను..’

పోలీసులు ఆ మహిళను విచారించినప్పుడు ఆమె చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరిని కలచివేశాయి. "నాకు నాన్న అంటే ప్రాణం.. ఆయన చనిపోయారనే నిజాన్ని నా మనస్సు అంగీకరించలేకపోయింది. ఆయనను దూరంగా పంపడం నా వల్ల కాలేదు. అందుకే నాన్న నాతోనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆమె కన్నీటిపర్యంతమైంది. అంతేకాకుండా మృతదేహాలను చాలాకాలం పాటు పాడవకుండా భద్రపరిచే ప్రత్యేక పద్ధతుల కోసం అమెరికాలోని ఒక ప్రైవేట్ కంపెనీని కూడా సంప్రదించినట్లు ఆమె తెలిపింది. తండ్రి మృతదేహాన్ని ఎలాగైనా అమెరికాకు తరలించి అక్కడ భద్రపరచాలనేది ఆమె ఆరాటం.

చట్టం-ఆరోగ్యం మధ్య నలిగిన బంధం

మహిళ వేదనను, తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమను పోలీసులు అర్థం చేసుకున్నప్పటికీ చట్టపరంగా.. ప్రజారోగ్య దృష్ట్యా మృతదేహాన్ని ఇంట్లో ఉంచడం నేరం. సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు సూచించినా ఆమె మొదట తండ్రిని వదులుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. చివరికి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మోర్ట్యూరీకి తరలించారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనూ కుమార్తెలు తల్లి మృతదేహాన్ని కెమికల్స్ ఉపయోగించి ఇంట్లోనే ఉంచిన ఘటనలు జరిగాయి. సాధారణంగా వైద్య, న్యాయపరమైన అవసరాల కోసం అధికారిక మార్చురీలలో మాత్రమే మృతదేహాలను ఉంచే వెసులుబాటు ఉంటుంది.

తండ్రిపై ఉన్న మితిమీరిన అనురాగం, ఆయనను కోల్పోయానన్న తీవ్రమైన మానసిక బాధే ఆ మహిళను ఈ విపరీతమైన నిర్ణయానికి ప్రేరేపించాయని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా నాలుగేళ్ల పాటు తండ్రి మృతదేహంతోనే ఒకే ఇంట్లో గడిపిన ఈ ఉదంతం మానవ సంబంధాల్లోని ఆవేదనను.. వియోగం ఇచ్చే వేదనను కళ్లకు కడుతోంది.

Tags:    

Similar News