వైసీపీ లేక‌పోయినా అసెంబ్లీ ర‌క్తిక‌ట్టిందే...!

అసెంబ్లీ వ్యవహారాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన కీలక వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య చర్చకు దారితీసాయి.;

Update: 2026-03-08 09:30 GMT

అసెంబ్లీ వ్యవహారాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన కీలక వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య చర్చకు దారితీసాయి. సభలో కూటమి పార్టీలకు సంబంధించిన 164 మంది సభ్యులు ఉన్నారు. మంత్రులు సభ్యులకు మధ్య అర్థవంతమైన చర్చలు కూడా నడిచాయి. అదే విధంగా కొందరు ఎమ్మెల్యేలు పదునైన ప్రశ్నలతోనే తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. ఒక్కొక్క సందర్భంలో అయితే మంత్రులు చేస్తున్న పనులను కూడా వారు నిలదీశారు. దీనిలో బిజెపి, జనసేన అదేవిధంగా టిడిపి సభ్యులు కూడా ఎవరికి వారు తమ తమ పాత్రలను మెరుగ్గా పోషించార‌ని చెప్పక తప్పదు.

అయితే ఇది ఎలా ఉన్నప్పటికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీలో మసాలా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి. అదే సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ కు పోలిక పెడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై స్పీకర్ చేసిన ప్రశంసలు కూడా కూటమి పార్టీల మధ్య చర్చకు వచ్చాయి. అసెంబ్లీ లాబీల్లో ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. స్పీకర్ తన అలవాటుగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయనకు ప్రత్యేక ఉద్దేశాలు ఏమీ లేవని టిడిపి ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.

ఇక స్పీకర్ చెప్పినట్టుగానే అసెంబ్లీలో మసాలా లేదా వైసిపి లేకపోతే అసెంబ్లీకి అందం రాలేదా అనే అంశాలపై కూడా నాయకులు వ్యాఖ్యలు చేశారు. వైపీపీ రాకపోయినా అసెంబ్లీలో చర్చలు బానే నడిచాయని మంత్రులు కూడా సమాధానం చెప్పారని ఒకానొక దశలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ప్రతిపక్షం లేని లోటును మా సభ్యులు తీర్చేస్తున్నారు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

బలమైన ప్రశ్నలతో అదేవిధంగా నిధులు, అధికారుల పనితీరును కూడా గోరంట్ల బ‌చ్చ‌య్య‌ చౌదరి వంటి సీనియర్ నాయకులు సభలో ప్రస్తావించారు. దీనికి మంత్రులు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అదే విధంగా బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను సభ దృష్టికి తీసుకువచ్చి లోపాలను ఎత్తి చూపించారు. వీటిని మంత్రులు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాలనే ప్రస్తావిస్తూ పలువురు సభ్యులు విపక్షం ఉన్నప్పటికీ ఇంతకన్నా ఏమీ జరగదని, విపక్షం రాకపోవడం తమ తప్పేమీ కాదని.. ప్ర‌తిప‌క్షం లేక‌పోయినా అసెంబ్లీని అధికార ప‌క్షం వారే ర‌క్తిక‌ట్టించార‌న్న‌ట్టుగా వ్యాఖ్యానించారు.

అయితే స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని కొందరు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఆది నుంచి తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని విధానాలను మాత్రమే వ్యతిరేకించామని చెప్పారు. వ్యక్తిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తమ నాయకుడు చంద్రబాబు కూడా గౌరవించారు అన్న విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. దీనిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని జగన్ తీరు ఇలానే ఉంటే వైసిపి వచ్చే ఎన్నికల నాటికి కూడా పుంజుకునే అవకాశం లేదని మరికొందరు సభ్యులు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News