హ్యాండిచ్చిన బ్రిటన్ కు షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా–బ్రిటన్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి.;

Update: 2026-03-08 08:57 GMT

పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా–బ్రిటన్ సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా తమ చిరకాల మిత్రదేశమైన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతానికి విమాన వాహక నౌకలను పంపించే విషయంలో యూకే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.

పశ్చిమాసియాలో ఇరాన్‌తో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా సమీకరిస్తోంది. ఈ క్రమంలో తమకు మిత్రదేశమైన బ్రిటన్ కూడా సహకరించాలని అమెరికా ఆశించింది. ముఖ్యంగా యూకేకు చెందిన ఆధునిక విమాన వాహక నౌక ‘హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్’ను పశ్చిమాసియాకు పంపాలని అమెరికా వర్గాలు భావించాయి. అయితే ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. యూకే రక్షణ మంత్రిత్వశాఖ నౌకను సిద్ధం చేస్తున్నామని తెలిపినా దానిని పశ్చిమాసియాకు తరలించే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ అధికారి మీడియాతో వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ బ్రిటన్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు యూకే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమని గుర్తుచేసిన ఆయన ఇప్పుడు కీలక సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. యుద్ధం కీలక దశలో ఉన్నప్పుడు మిత్రదేశాల మద్దతు అవసరమని పేర్కొన్న ట్రంప్.. ఇప్పుడు ఆలస్యంగా మద్దతు తెలిపే అవసరం లేదని వ్యాఖ్యానించారు. “యుద్ధం గెలిచిన తర్వాత చేరే మిత్రులు మాకు అవసరం లేదు. ఈ చర్యను మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం” అంటూ స్టార్మర్‌కు హెచ్చరికల ధోరణిలో వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో తమ బలగాలు ప్రత్యక్షంగా పాల్గొనబోవని బ్రిటన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అమెరికా , ఇజ్రాయెల్ తమ సైనిక స్థావరాలను ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తెలిపారు. ఈ నిర్ణయంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడం తాను ఆశ్చర్యపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు ఇరాన్ అంశంలో కుర్దుల పాత్రపై కూడా ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుర్దులు ముందుకు రావాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తూ మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌పై దాడి చేయడానికి కుర్దుల సహకారం అవసరం లేదన్నారు. కుర్దులతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని కానీ యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేయాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.

మొత్తంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా అమెరికా–బ్రిటన్ వంటి మిత్రదేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్ అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News