అంతా కుమ్మక్కు... వివేకా కేసులో సీబీఐ సంచలనం

Update: 2022-10-17 09:27 GMT
ఆయన సామాన్యుడు కాదు, ఆషామాషీ మనిషి కానే కాదు, ఒక దివంగత సీఎం తమ్ముడు, ప్రస్తుత ఏపీ సీఎం కి బాబాయ్. ఇక తాను స్వయంగా మంత్రిగా ఎంపీ గా పనిచేసిన వారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. దానికి కారణం ఏంటో సీబీఐ తాజాగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్ ద్వారా చెప్పినట్లు అయింది.

వివేకా హత్య కేసులో నిందితులు స్థానిక పోలీసులు కుమ్మక్కు అయ్యారని సీబీఐ సంచలన ఆరోపణలనే చేసింది. ఈ కేసులో విచారణ సాఫీగా సాగకపోవడానికి ఇదే ప్రధాన కారణం అన్నట్లుగానే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ బట్టి అర్ధం అవుతోంది.

వివేకా దారుణ హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే అని సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన బయట ఉంటే ఈ కేసులో సాక్ష్యులకు ప్రాణ భయం ఉంటుందని కూడా పేర్కొనడం విశేషం.

ఈ కేసులో సాక్ష్యులను రక్షించుకోవాలంటే కచ్చితంగా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పట్టుబడుతోంది. దీంతో ఈ కేసు మీద విచారిస్తున్న జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన సుప్రీం  కోర్టు  ధర్మాసనం  సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. గంగిరెడ్డికి సీబీఐ  పిటిషన్ మీద సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలలోగా సీబీఐ అభియోగాలకు గంగిరెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది.
Read more!

ఇక ఈ కేసుని సుప్రీం కోర్టు నవంబర్ 14కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే తన తండ్రి కేసులో అసలు  దోషులు ఎవరో తెలియకపోవడం ఈ కేసు అడుగు కూడా ముందుకు కదలకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న వివేకా కుమర్తె డాక్టర్ సునీత ఏపీ నుంచి ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విధితమే.

ఇపుడు సీబీఐ పిటిషన్ లో లోకల్ గా  అంతా కుమ్మక్కు అయ్యారు అని తీవ్ర అభియోగం ఉంది. లోకల్ పోలీసుల మీదనే ఈ విధంగా ఆరోపణలు చేసింది. దాంతో ఈ కేసుని సుప్రీం కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తుందా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే చాలా తొందరగానే వివేకా హత్య కేసులో ఎవరు ఉన్నారు అన్న విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News