ఏపీలో ఇన్ని జరుగుతున్నా.. పవన్ నోరు విప్పటం లేదేంటి?

Update: 2021-08-09 11:01 GMT
''ప్రశ్నించేందుకే పార్టీ పెట్టా. పవర్ అక్కర్లేదు.. పదవులు అక్కర్లేదు. ప్రజలకు సేవ చేసేందుకే పని చేస్తాం'' లాంటి మాటలు చెప్పటం కష్టమే. కానీ.. అందుకు భిన్నంగా ఈ మాటల్నే చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు ఏమైంది? ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు.. తాను జత కట్టిన స్నేహితుడి కారణంగా ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. రాష్ట్ర ప్రయోజనాల్ని.. ప్రజలకు సమస్యల్ని తెచ్చి పెడుతున్న తీరుపై ఆయన ఎందుకు ప్రశ్నించటం లేదు. నోరు తెరిచి మాట్లాడటం మానేసి.. కేవలం ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితమైన ఆయన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయన్ను అర్థం చేసుకున్నవారికి.. అపార్థం చేసుకున్న వారికి.. ఇప్పుడు ఆయన తీరు ఒక పట్టాన అర్థం కానట్లుగా తయారైంది. ఏ సమయంలో అయితే మౌనంగా ఉండకూడదో.. ఏ అంశాల విషయాల్లో పట్టనట్లుగా వ్యవహరించకూడదో.. అలాంటి పరిస్థితులు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నా పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా తాను నమ్మిన స్నేహితులు పుట్టి ముంచటమా? లేక మరింకేమైనా ఉన్నదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆయన మౌనం ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమని.. రెండు ప్రాంతాల్లోని తెలుగు వారు బాగుండాలని చెప్పే పవన్..ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అస్సలు మాట్లాడటం లేదు.

తెలంగాణతో పోలిస్తే..తన రాజకీయ ప్రయాణానికి గమ్యస్థానంగా ఏపీనే ఆయన ఎంచుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు. రోజుల తరబడి మకాం వేశారు. అక్కడి స్థానిక సమస్యలు.. అంశాల్ని అధ్యయనం చేసుకోవటంతో పాటు.. వంట పట్టించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఆయన మాత్రం తాను అనుకున్నట్లుగా విజయాన్ని సాధించటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.

ఏపీలోని మూడు ప్రాంతాల్లోనూ పవన్ పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. ఉత్తరాంధ్ర.. రాయలసీమతో పాటు.. కోస్తాలో ఆయన పర్యటనలు చేశారు. అక్కడి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేయటమే కాదు.. శ్రీకాకుళంలోని ఉద్దాణంలోని కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని తపించారు. సీమ రైతులు నీళ్ల కోసం ఎన్నేళ్లు పాటు ఎదురుచూడాలని ప్రశ్నించారు. ఇలా ప్రతి అంశాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకొని.. పెద్ద తప్పు చేశారని ఆయన్ను విమర్శించే వారు గొంతు చించుకున్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పాచిపోయిన లడ్డూలంటూ ఎటకారం చేసిన నోటితోనే.. మిత్రుడిగా ఒప్పుకున్నారు. ఇంతా చేసిన దానికి ప్రతిగా రాష్ట్రానికి ఏమైనా దక్కుతుందా? అని ఆశ పడ్డ వారికి నిరాశనే మిగిల్చారు. ఈ రోజున విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామని తేల్చి చెబుతున్నా.. ఏపీ ప్రత్యేక హోదా లేదు పాడు లేదని చెప్పినా.. విశాఖకు రైల్వే జోన్ లాంటి అత్యాశలేమీ అక్కర్లేదని తరచూ చెప్పేసినా.. బీజేపీతో ఎందుకు ఉన్నట్లు? అన్నది అసలు ప్రశ్న. తన మౌనంతో ఆయన కొత్త సందేహాలు కలిగేలా చేస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజధాని అమరావతికి ఆయన ఇచ్చిన మద్దతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి రైతుల్లో కొందరు నిరసన గళం విప్పితే..ప్రత్యేకంగా వారివద్దకు వచ్చి.. వారు చెప్పింది విని.. నాటి బాబు ప్రభుత్వానికి అల్టిమేటం లాంటివి ఇవ్వటం.. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన పవన్.. ఇప్పుడు అదే అమరావతి అన్నదే ప్రశ్నగా మారిన వేళలోనూ మౌనంగా ఉంటున్నారెందుకు? అమరావతికి బదులుగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఏపీ సర్కారు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన కార్యాచరణను ప్రకటించలేదు సరికదా.. ఒక్క మాట మాట్లాడకుండా ఉండిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరమని.. రాజధాని అమరావతిని ఎవరూ మార్చలేరని గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి పోరాటానికి బాసటగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పటాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఒక దశలో బీజేపీ పొత్తుపై మాట్లాడుతూ.. తాను చేతులు కలిపింది రాజధాని అమరావతి సాధన కోసమేననిల చెప్పిన  పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి సాధన కోసం సాగుతున్న ఉద్యమంపై సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదెందుకు?

ఇవన్నీ ఏపీకి సంబంధించిన ఇష్యూలైతే.. ఈ రోజున రెండు తెలుగురాష్ట్రాలు ప్రాజెక్టు విషయంలో కొత్త లొల్లిని పెట్టుకుంటున్నాయి. ఈ అంశం మీదా ఆయన నోరు విప్పింది లేదు. ఎందుకిలా? ఆయన అంతర్మధనంలో ఉన్నారా? సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలని డిసైడ్ అయ్యారా? ప్రజలు తనను పట్టించుకున్నప్పుడు.. తన అవసరం ఉందని బలంగా భావించినప్పుడు మాత్రమే నోరు విప్పాలని అనుకుంటున్నారా? ఇంతకీ పవన్ ఏమనుకుంటున్నారు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం దొరకాలంటే ఆయన మౌనం వీడితే తప్పించి చిక్కుముడి వీడదని చెప్పక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని జరుగుతున్నా.. ఏమీ తెలీనట్లు.. మరేమీ పట్టనట్లుగా ఎందుకుంటున్నావ్ పవన్? అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం దొరికేదెప్పుడో?
Tags:    

Similar News