విజేతల ప్రకటన ఆలస్యం..కారణమిదే..

Update: 2019-04-30 06:31 GMT
మే 23. ఇప్పుడు ఈ తేదీ కోసమే రాజకీయ నాయకులు.. ప్రజలందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేశంలో ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో, దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే. అయితే ప్రతీసారి మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలు వెలువడేవి. కానీ ఈసారి మాత్రం ఫలితాల ప్రకటన ఆలస్యం కానుంది.

ఎన్నికల కమిషన్ తాజాగా ఫలితాల ప్రకటన ఆలస్యం అవుతుందని ప్రకటన విడుదల చేసింది. ఈ సారి ఎన్నికల పోలింగ్ లో వీవీప్యాట్స్ ను లెక్కించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు ఈవీఎంల వీవీ ప్యాట్స్ ను లెక్కించాలని సుప్రీం ఆదేశించింది. దేశంలోని 22 రాజకీయ పార్టీలు 50శాతం వీవీ ప్యాట్ లు లెక్కించాలని కోరినా అది సాధ్యం కాదని కేవలం 5 వీవీ ప్యాట్ లు లెక్కిస్తామని ఈసీ తెలిపింది. అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీ ప్యాట్స్ లెక్కించాలి.

ఈ మేరకు వీవీ ప్యాట్స్ లెక్కించిన తర్వాతే ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.   ఈవీఎంల లెక్కింపు పూర్తయినా దాని తర్వాత దాదాపు రెండు గంటలు వీవీ ప్యాట్స్ లెక్కించడానికే పడుతుందని ఈసీ భావిస్తోంది. ఈ ప్రక్రియను అంతా కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలోనే జరగనుంది. ఆ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అధికారిక ప్రకటన రావాలంటే సాయంత్రం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయి.  జనాలు, నాయకులు ఉగ్గబట్టి ఉండాల్సిందే..
Tags:    

Similar News