సంక్షోభ సంకేతాలు : దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు?
దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యానికి చిరునామాగా.. పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లిన దుబాయ్ నగరం ప్రస్తుతం ఊహించని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.;
దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యానికి చిరునామాగా.. పర్యాటకుల స్వర్గధామంగా విరాజిల్లిన దుబాయ్ నగరం ప్రస్తుతం ఊహించని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే దుబాయ్ ఆర్థిక మూలస్థంభాలు ఒక్కొక్కటిగా కదులుతున్నట్లు స్పష్టమవుతోంది. రియల్ ఎస్టేట్ నుంచి పర్యాటకం వరకు ప్రతి రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది, ఇది కేవలం స్థానిక సమస్యగానే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పతనం
దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కుప్పకూలుతోంది. తాజా గణాంకాల ప్రకారం కేవలం రెండు వారాల వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ సూచీ 35 శాతం మేర పడిపోవడం గమనార్హం. దుబాయ్ రూపురేఖలను మార్చిన దిగ్గజ నిర్మాణ సంస్థలు ఎమార్ , ఆల్దర్ వంటి కంపెనీల షేర్లు 40 శాతం మేర పతనం కావడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులు నిలిచిపోవడం, కొత్త కొనుగోలుదారులు కరువవ్వడం వల్ల ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమవుతోంది.
ఆర్థిక మార్కెట్లు.. బాండ్ల ఒత్తిడి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్పొరేట్ బాండ్లు ప్రస్తుతం అంతర్జాతీయ ఎమర్జింగ్ మార్కెట్లలో అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్నాయి. పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం లేదా సురక్షితమైన మార్కెట్ల వైపు మళ్లడం వల్ల దుబాయ్ ఆర్థిక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం దుబాయ్ ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల సంకేతాలను ఇస్తుండటంతో కొత్త పెట్టుబడులు రావడం గగనంగా మారింది.
వెలవెలబోతున్న పర్యాటక రంగం
దుబాయ్ అంటేనే విలాసవంతమైన హోటళ్లు, పర్యాటక ఆకర్షణలు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, అనిశ్చితి వల్ల వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. పర్యాటక సీజన్ ముగుస్తున్న తరుణంలో లక్షలాది హోటల్ , టూర్ బుకింగ్స్ రద్దు కావడం వల్ల పర్యాటక రంగం కోలుకోలేని దెబ్బతిన్నది.
ముడి చమురు ధరల సెగ
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు 100 డాలర్ల మార్కును తాకడం దుబాయ్‌కు మరో గండంగా మారింది. చమురు ఉత్పత్తిదారుగా లబ్ధి పొందుతున్నప్పటికీ పెరిగిన ఇంధన ధరల వల్ల రవాణా, నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి, సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించింది. వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించలేక మూతపడే స్థితికి చేరుకున్నాయి.
ఒకే సమయంలో రియల్ ఎస్టేట్ పతనం, పర్యాటక రంగం క్షీణత, ఆర్థిక మార్కెట్ల అస్థిరత కలగలిసి దుబాయ్‌ను ఒక సంక్లిష్టమైన సంక్షోభంలోకి నెట్టాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఉద్దీపన పథకాలను ప్రకటించకపోతే ఈ "మడారి నగరం" పూర్వవైభవాన్ని సంతరించుకోవడం కష్టతరమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.