ఒంగోలు సీటు...డిసైడ్ చేసిన జగన్
ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీలో రీ ఎంట్రీ ఉంటుందని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.;
ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీలో రీ ఎంట్రీ ఉంటుందని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అదే సమయంలో బాలినేని జనసేనలో చేరిపోయారు కానీ అక్కడ ఆయనకు అనుకున్నంతగా కలసి రావడం లేదని కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోకి బాలినేని తిరిగి వస్తే ఆయనకు ప్రకాశం జిల్లాలో పూర్వ వైభవం దక్కుతుంది అని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్ ఈ తరహా ఊహాగానాలకు అతి పెద్ద చెక్ పెట్టేశారు అని అంటున్నారు.
తొలి అభ్యర్ధిగా :
ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో ఒంగోలు పార్టీ ఇంచార్జిగా ఉన్న చుండూరు రవిబాబుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తొలి అభ్యర్ధిగా ప్రకటించారు అని అంటున్నారు. రవి చాలా చక్కగా పనిచేస్తున్నారు అని జగన్ కొనియాడారు. ఆయన గత ఏడాదిన్నరగా వైసీపీ అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారని కూడా అన్నారు. ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు అని అన్నారు. అందువల్ల ఆయనకు తాను ఎపుడూ అండగా ఉంటాను అంటూ ఆయనకే ఒంగోలు బాధ్యతలు అని పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు.
బలమైన సామాజిక వర్గం :
ఇదిలా ఉంటే ఒంగోలులో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఆధిపత్యం చేస్తూ ఉంటాయన్నది ఒక రాజకీయ వాస్తవం. ఈ నేపథ్యంలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన చుండూరు రవిబాబుని ముందుకు తీసుకుని రావడం ద్వారా జగన్ ప్రయోగం చేస్తున్నారు. అని అంటున్నారు. ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా గణనీయంగా ఉందని అంటున్నారు. ఇక ఈ జిల్లాలో ఒంగోలు అసెంబ్లీ సీటు చాలా కీలకంగా మారింది అని అంటున్నారు. సాంప్రదాయకంగా చూస్తే ఇక్కడ కమ్మ, రెడ్డి వర్గాల ఆధిపత్యం ఉంది. ఈ క్రమంలో కాపులు బీసీ వర్గాల వారు కూడా గణనీయంగా ఉంటారని అంటున్నారు. దాంతో వైసీపీ కీలక సామాజిక వర్గం నుంచే చుండూరు రవిబాబుని ఎంపిక చేసింది అని చెబుతున్నారు.
ఈ డెసిషన్ వెనక :
వైసీపీ వైపు బాలినేని చూస్తున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. మరి ఈ క్రమంలో ఒంగోలు కి ఇంఛార్జిగా ఉన్న రవిబాబుకు తన అండదండలు ఉంటాయని స్వయంగా జగన్ ప్రకటించడం ఏ రకమైన సంకేతమని విశ్లేషణ సాగుతోంది. మరో వైపు నుంచి చూస్తే వైసీపీ ఈసారి యువతకు కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటోంది అని చెబుతున్నారు. అంతే కాదు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారిని తిరిగి తీసుకునే విషయంలో కూడా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఒంగోలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి.