వైసీపీ మిస్ అవుతున్న లాజిక్ ఇదే !

వైసీపీ నేతలు అయిదేళ్ళ తమ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్నారు.

Update: 2026-08-01 20:10 GMT

వైసీపీ నేతలు అయిదేళ్ళ తమ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటున్నారు. అయితే వారు అప్పుడు చెప్పలేకపోయారు, ఇపుడు చెబుతున్నారు, అది కూడా కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నపుడు ట్వీట్లు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఆ క్రెడిట్ తమదని, కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోంది అని అంటున్నారు. అయితే నిజంగా వైసీపీ తమ హయాంలో అభివృద్ధి చేసినా ఇపుడు ఆఖరి నిముషంలో చెప్పుకోవడం వల్ల జనాల్లోకి ఎంత మేరకు వెళ్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న అంటున్నారు. అంతే కాదు క్రెడిట్ చోరీ పేరుతో వైసీపీ చేసే వాదనలు కూడా లాజికల్ గా తేలిపోతున్నాయని అంటున్నారు.

ప్రభుత్వాలు నిరంతరం :

ఈ సూక్ష్మం వైసీపీ పాలకులు విస్మరించడం వల్లనే ఇన్ని తిప్పలు అని అంటున్నారు. ఇది బాగా తెలియడం వల్లనే కూటమి ఇపుడు క్రెడిట్ తీసుకునే హక్కుని నూరు శాతం పొందుతోందని అంటున్నారు. నిజానికి చూస్తే ఏ ప్రభుత్వం అయినా అయిదేళ్ళలో తానే శంకుస్థాపన చేసి తమ పాలనా హయాంలో ప్రారంభోత్సవం చేసిన చరిత్ర బహు తక్కువ. అతి పరిమితమైనది ఆ కాలం. భారీ ప్రాజెక్టులు తీసుకుంటే అవి నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాల్సి ఉంటుంది. అలా చేస్తే కచ్చితంగా ఆ క్రెడిట్ లో వాటి వాటా కూడా ఉంటుంది. అయితే ఏపీలో చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టు ఆలోచన చేసింది భోగాపురం స్థలాన్ని ఎంపిక చేసి పునాది రాయి వేసింది టీడీపీ అన్నది వాస్తవం.

వైసీపీ హయాంలోనూ :

ఇక వైసీపీ హయాంలో చూస్తే భూసేకరణ జరిగింది. నష్ట పరిహారం చెల్లించారు, నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2024 లో వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చాక అది మరింతగా వేగం పుంజుకుని 25 నెలల్లోనే ఎయిర్ పోర్టు ప్రారంభం అయింది. ఇందులో కూటమి క్రెడిట్ కూడా ఉంది. అంతే కాదు కూటమి పాలకులు జగన్ ప్రభుత్వంలో నిర్మాణం మొదలైంది కదా అని వదిలిపెట్టలేదు, మరింత వేగాన్ని పెంచారు, దాని మీద తమ ముద్ర బలంగా వేసుకున్నారు. అందుకే ఇపుడు అది కూటమి ప్రభుత్వం క్రెడిట్ గా జనంలోకి వెళ్ళిపోయింది. ఇదే తీరున వైసీపీ హయాంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించి సగం పూర్తి అయిన వాటిని తాము పూర్తి చేసి ఉంటే కచ్చితంగా తమ ఖాతాలో వేసుకుని ఉండవచ్చు. కానీ ఆ పని చేయలేక పోయారు అని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ మూడు రాజధానులు అని పిల్లి మొగ్గలు వేయకుండా అయిదేళ్ళ కాలంలో ఎంతో కొంత నిర్మాణాలు చేపట్టి ముందుకు అడుగులు వేసి ఉంటే కచ్చితంగా వైసీపీకి కూడా క్రెడిట్ వాటా వచ్చేదని అంటున్నారు. అలాగే పోలవరం విషయంలో కూడా వైసీపీ జోరు పెద్దగా చూపించలేదని కూడా కూటమి నుంచి విమర్శలు ఉన్నాయి.

ఎందుకు చెప్పుకోలేదని :

ఇక వైసీపీకి కూటమికి తేడా కూడా మరొకటి ఉంది. తాము చేసిన మంచి పనులు ఎవరైనా చెప్పుకోవాల్సిందే. అలా ఎందుకు వైసీపీ ఆనాడు చేసుకోలేకపోయింది అన్నది ప్రశ్న. సరిగ్గా కూటమి ప్రారంభోత్సవాలు చేసినపుడే వైసీపీ నేతలు రంగంలోకి దిగి తామే అన్నీ చేశామని ఎంత చెప్పుకున్నా అది జనాలకు ఏ మేరకు ఎక్కుతుంది అన్నది కూడా గమనించాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఎవరు మొదలెట్టారు ఎవరు పూనుకున్నారు అన్న దాని కంటే ఫలితాలనే జనాలు గుర్తు పెట్టుకుంటారు. ఆ విధంగా ఫలితాలను తీసుకుని రావడం ప్రతీ కార్యక్రమాన్ని ఒక లాజికల్ ఎండ్ కి చేర్చడం ద్వారానే కూటమి క్రెడిట్ తీసుకుంటోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ఈ విషయాలను గుర్తు పెట్టుకుని వ్యవహరిస్తే ఈ క్రెడిట్ వార్ అన్నది ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News