భారత్ రెడీ.. డ్రాగన్, పాక్‌లకు దడ పుట్టించేలా కళ్ళు చెదిరే ప్రయోగానికి రంగం సిద్ధం

భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను.. సరిహద్దు భద్రతను మరోస్థాయికి తీసుకెళ్లే దిశగా ఒక బృహత్తర అడుగు వేస్తోంది.

Update: 2026-08-01 20:09 GMT

భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను.. సరిహద్దు భద్రతను మరోస్థాయికి తీసుకెళ్లే దిశగా ఒక బృహత్తర అడుగు వేస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుమారు 2,530 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగానికి దేశం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 6 లేదా 7 తేదీలలో ఈ కీలక ప్రయోగం జరగవచ్చని రక్షణ వర్గాల సమాచారం.

'నోటామ్' హెచ్చరికలు జారీ

క్షిపణి పరీక్షను పురస్కరించుకుని భారత అధికారులు ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నోటామ్ సముద్ర హెచ్చరికలను జారీ చేశారు. ప్రయోగ సమయంలో పౌర విమానాలు, వాణిజ్య నౌకల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత గగనతలం, సముద్ర మార్గాల్లో రాకపోకలను నియంత్రించేందుకు ముందస్తు సూచనలు అందించారు. ఈ ప్రయోగ కారిడార్ ఒడిశా తీరంలోని ప్రసిద్ధ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వీలర్ ఐలాండ్ తో అనుసంధానమై ఉండనుంది. భారత్ నిర్వహించే అత్యంత కీలకమైన వ్యూహాత్మక క్షిపణి పరీక్షలకు ఈ ద్వీపమే ప్రధాన వేదిక. ఈ ప్రయోగాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించనుండగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తోంది.

ప్రయోగించబోయే క్షిపణి ఏది?

ఈ పరీక్షలో ఏ మోడల్ క్షిపణిని ప్రయోగిస్తున్నారనే దానిపై అధికారికంగా స్పష్టత రానప్పటికీ రక్షణ రంగ నిపుణులు కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. అగ్ని సిరీస్ కొత్త వెర్షన్ గా చెబుతున్నారు. ఇది అగ్ని సిరీస్‌లో మరింత ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సరికొత్త మోడల్ కావచ్చు. కే-4 బాలిస్టిక్ మిస్సైల్ కావచ్చు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే-4 బాలిస్టిక్ క్షిపణి యొక్క ఆధునిక రూపం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ వద్ద 5,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని ఛేదించగల అగ్ని-5 వంటి ఖండాంతర క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. అయితే 2,530 కి.మీ. పరిధి కలిగిన ఈ నూతన క్షిపణి పరీక్ష ముఖ్యంగా సముద్ర ఆధారిత అణు నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

వ్యూహాత్మక 'న్యూక్లియర్ ట్రయాడ్'

హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి, భారత భద్రతకు అత్యంత కీలకమైన భూభాగం. చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల వ్యూహాత్మక కదలికలు, సముద్ర మార్గాల్లో పెరిగిన చొరబాట్లను తిప్పికొట్టేందుకు భారత్ తన సైనిక పటవాన్ని నిరంతరం నవీకరిస్తోంది.

భూమి, సముద్రం, ఆకాశం అనే మూడు వేదికల నుంచి అణు దాడులను తిప్పికొట్టగల 'న్యూక్లియర్ ట్రయాడ్' సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇలాంటి దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు ఎంతో దోహదపడతాయి.

ఈ ప్రయోగం విజయవంతమైతే అది భారత స్వదేశీ రక్షణ పరిజ్ఞానానికి దక్కే మరో మహత్తర విజయంగా నిలవడమే కాకుండా హిందూ మహాసముద్రంలో భారతదేశపు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే ఈ ప్రయోగంపై ప్రస్తుతం ప్రపంచ దేశాల రక్షణ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News