రాజ్యసభ ఎంపీ బరిలోకి వైసీపీ వేమిరెడ్డి!

Update: 2018-02-24 12:14 GMT
నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పారిశ్రామికవేత్త, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు అయిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ పదవికి బరిలోకి  దిగనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాజశేఖర రెడ్డికి ఆప్తులైన వ్యక్తులుగా సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవలు అందిస్తున్నప్పటికీ.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నడూ ఎలాంటి పదవులనూ పొందలేదు. అసలు ఆ ఊసు పట్టకుండానే ఉండేవారు.

జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా... ఆయనతో సన్నిహితంగానే ఉన్నారు గానీ.. పదవులకోసం అర్రులు చాచలేదు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని జగన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వ బరిలోకి దించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

వైసీపీ ఈ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఒకే ఒక్క విమర్శ వినిపిస్తోంది. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపడం అంటే.. జగన్ కు ఇతర వర్గాలనుంచి విమర్శలు వస్తాయేమో అని పలువురు అనుకుంటున్నారు. అయితే జగన్ ది వ్యూహాత్మక ఎత్తుగడ అని కూడా పలువురు చెబుతున్నారు.

రాజ్యసభ ఎంపీ ఎన్నికల విషయంలో అసెంబ్లీలో ఉండే బలాబలాల పరంగా.. వైఎస్ ఆర్ పార్టీకి ఒక సీటునైనా గెలుచుకునేంత నికరమైన బలం లేదు. ప్రథమ ప్రాధాన్య ఓట్లలో అప్పటికీ వారికి రెండు ఓట్లు తగ్గుతాయి. ఆ నేపథ్యంలో అభ్యర్థిని పోటీకి దించడం అంటే సాహసమే అని చెప్పాలి. అదే సమయంలో తెలుగుదేశం, భాజపాల ఓట్లు మిగులుతాయి కూడా.

ఇలాంటి నేపథ్యంలో సాత్వికుడిగా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అయితే.. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కూడా ఉన్న సత్సంబంధాలను వినియోగించుకుని ఖచ్చితంగా విజయం సాధించగలడని ఒక అంచనా సాగుతోంది. అందుకే జగన్ చాలా వ్యూహంతోనే ఆయనను ఎంపిక చేశారని చెబుతున్నారు. మరి వేమిరెడ్డిపై పోటీగా చంద్రబాబు - తమకు కూడా సొంతంగా చాలినంత బలం లేకపోయినప్పటికీ మూడో అభ్యర్థిని రంగంలోకి దింపుతాడో లేదో చూడాలి.

Tags:    

Similar News