ఒకే ఫ్రేమ్ లో జగన్, విజయమ్మ.. షర్మిలమ్మ ఎక్కడమ్మా..!
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలైన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలూ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.;
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలైన నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలూ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తాజాగా గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ హయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా.. వాటిలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో వేడుక జరుపుకున్నారు!
అవును... ప్రతీ ఏటా వైఎస్ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పులివెందుల పర్యటనలో ఉన్న జగన్.. వారి పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు! సుమారు ప్రతీ ఏటా డిసెంబర్ 23, 24 తేదీల్లోనే ఇంట్లో క్రిస్మస్ వేడుకులు జరుపుకుని.. అనంతరం స్థానిక చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు!
ఈ క్రమంలో ఈ ఏడాది కూడా జగన్ తన కుటుంబ సభ్యులతో ఇంట్లో క్రిస్మస్ జరుపుకున్నారు! ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. వీరితో పాటు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా కనిపించారు కానీ.. ఆసక్తికరంగా వైఎస్ షర్మిల కనిపించకపోవడం గమనార్హం. అయితే... తాజాగా వైరల్ అవుతున్న ఫోటో ఎప్పుడు తీయబడిందనేది మాత్రం అధికారికంగా ధృవీకరణ కాలేదు!
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో.. పై మెట్టుపై వైఎస్ జగన్ కనిపించగా.. కింద వైఎస్ విజయమ్మ, ఆమె పైవరుసలో వైఎస్ భారతి, ఆమె పక్కన షర్మిల కుమారుడు రాజారెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కనిపించారు. అయితే ఈ ఫోటోలో ఇంటి ఆడపడుచు షర్మిల కానీ, ఆమె భర్త అనిల్ కానీ.. ఆమె కుమార్తె కానీ కనిపించడం లేదు! దీంతో.. ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కాగా... ఇటీవల వైఎస్ షర్మిల పుట్టిన రోజు సందర్భంగా జగన్ నుంచి శుభకాంక్షలు రాని సంగతి తెలిసిందే. అయితే.. జగన్ బర్త్ డే కి మాత్రం షర్మిల నుంచి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు అందాయి.. దీనికి జగన్ నుంచి ధన్యవాదాల రిప్లై కూడా వచ్చింది! అయితే వీరి బంధం అక్కడితోనే ఆగినట్లుంది.. కలిసి క్రిస్మస్ జరుపుకునే వరకూ ఇంకా మెరుగుపడలేనట్లుందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీ కేంద్ర కార్యాలయంలోనూ ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా... ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కొమ్మూరి కనకరావు, లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి, తదితరులు పాలొన్నారు.