ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్... వృద్ధురాలి నుంచి ఆశీర్వాదం!

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఇప్పటం గ్రామం కూడా కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-24 07:48 GMT

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఇప్పటం గ్రామం కూడా కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో జనసేన ఏర్పాటు చేసిన సభకు భారీ స్పందన వచ్చింది. 2022లో పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని, 9వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా నాడు ఆ సభ జరిగింది. ఆ సమయంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి.




దీనిపై అప్పుడు పెద్ద రాద్దాంతమే జరిగింది! పవన్ నిప్పులు చెరిగారు. ఇదే క్రమంలో.. వైసీపీ హయాంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చి వేయడంతో ఆ గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. తానున్నానని భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఇప్పటం రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది.. పవన్ సరేనని మాట ఇచ్చారు.




అవును... మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారు.. ఇచ్చాక ఇంక ఆలోచించేదేముందు.. చేసేయడమే కాదా! ఈ నేపథ్యంలోనే ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇ సమయంలో నాడు ఇప్పటంలో వృద్ధురాలు నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ కల్యాణ్ బయలుదేరారు. ఇందులో భాగంగా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం చేరుకున్నారు. నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు.




ఈ సమయంలో నాగేశ్వరమ్మ పవన్ కు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె పాదాలకు నమస్కరించి పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో.. ఆ వృద్ధురాలికి రూ.50 వేలు, ఆమె మనవడి చదువుకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించిన పవన్.. ఆమె మనవడి చదువుకు ప్రతి నెల తన వేతనం నుంచి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కాసేపు ఆ కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం వృద్ధురాలు నాగేశ్వరమ్మ మాట్లాడారు. ఈ సందర్భంగా... ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంటికి పెద్ద కుమారుడిలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారని.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారని ఆమె తెలిపారు.

కుర్చీలతో కొట్టుకున్న జనసేన కార్యకర్తలు!:

ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ కల్యాణ్ చేపట్టిన ఇప్పటం పర్యటన కార్యకర్తల్లో ఉత్సాహం నింపాల్సి ఉండగా.. దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరును బహిర్గతం చేసినట్లయ్యిందనే చర్చకు దారితీసింది! ఇందులో భాగంగా.. పవన్ రాకముందు ఏర్పాట్ల విషయంలో స్థానిక నాయకుల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ.. పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు.

ఈ ఘర్షణల్లో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులకు భరోసా ఇవ్వడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి పవన్ వస్తున్న తరుణంలో ఇలా సొంతపార్టీలోనే ఇలా కుర్చీలు ఇచ్చుకుని కొట్టుకునే స్థాయి విభేదాలు బయటపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు స్పందించి లాఠీలకు పనిచెప్పడంతో.. వాతావరణ కాసేపు ప్రశాంతంగా మారింది!

Tags:    

Similar News