తెలంగాణ ‘డీటీసీ’ ఆస్తులు రూ.200 కోట్లు?
ఆయనో అత్యున్నత స్థాయి అధికారి కూడా కాదు. తెలంగాణ రవాణా శాఖలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ (కిషన్ నాయక్) మాత్రమే.;
ఆయనో అత్యున్నత స్థాయి అధికారి కూడా కాదు. తెలంగాణ రవాణా శాఖలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ (కిషన్ నాయక్) మాత్రమే. అలాంటి ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన ఆస్తుల చిట్టా కళ్లు తిరిగేలా చేస్తున్న పరిస్థితి. మార్కెట్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ దగ్గర దగ్గర రూ.200 కోట్లు దాటేస్తాయని అంచనా వేస్తున్నారు. రవాణా శాఖలో ఒక మోస్తరు స్థాయి అధికారిఇంత భారీగా వెనకేయటం ఇపపుడు చర్చనీయాంశంగా మారింది.
జిల్లా డీటీసీగా వ్యవహరిస్తున్న కిషన్ నాయక్ కు 41 ఎకరాల వ్యవసాయ భూములు.. కేజీ బంగారంతో పాటు .. పెద్ద హోటల్లో వాటా.. ఫర్నీచర్ షాపుల్లో వాటాలతో పాటు పలు ఆస్తులు ఉన్నట్లుగా లెక్కలు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లిలోని ఇంటితో పాటు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనకున్న ఆస్తుల చిట్టా భారీగా ఉన్నట్లు తేలింది. బ్యాంకు ఖాతాల్లోనే రూ.1.37 కోట్ల నగదు ఉన్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్ లోని ఒక హోటల్ లో 50 శాతం వాటాతో పాటు.. 3 వేల వాణిజ్య స్థలం.. రెండు ఫ్లాట్లు.. ఇలా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజు హైదరాబాద్ లోని కిషన్ నాయక్ ఇంటి మీదా.. హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్ లోని ఆయన సన్నిహితులు.. బంధువుల ఇళ్ల మీదా మొత్తం పన్నెండుచోట్ల ఏకకాలంలో సోదాలునిర్వహించారు. కిషన్ నాయక్ సొంతూరు సంగారెడ్డి జిల్లా బల్కంచెల్క తండా.
ఈయనకు నారాయణఖేడ్ లో 31 ఎకరాలు.. నిజామాబాద్ లో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న విషయాన్ని తాజా సోదాల్లో గుర్తించారు. ఆయనకు నాలుగువేల చదరపు అడుగుల స్తలంలో పాలి హౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాల లెక్కల ప్రకారం కిషన్ నాయక్ ఆస్తులు రూ.12.7 కోట్లుగా చెబుతున్నారు. అయితే.. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ రూ.200 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలం వరకు కిషన్ నాయక్ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. ఏడాది క్రితమే మహబూబ్ నగర్ కు బదిలీ అయ్యారు. రవాణా శాఖలో డీటీసీగా వ్యవహరిస్తున్న ఆయన జీతం రూ.లక్షన్నర లేదంటే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చని.. కానీ ఆయన ఆస్తులు ఏ మాత్రం పొంతన లేని విధంగా ఈ స్థాయిలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.