మాజీ మంత్రి అంబటికి మరో షాక్.. 'పీటీ వారెంటు'తో సీన్ రివర్స్!
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు పోలీసులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు.;
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు పోలీసులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఆయనపై వరుస పీటీ వారెంట్లు దాఖలు చేస్తూ జైలు నుంచి విడుదల కాకుండా బ్రేకులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిలు పొందిన అంబటి గురువారం జైలు నుంచి విడుదల అవుతారని అనుకుంటుండగా, మరో షాకింగ్ లాంటి వార్త బయటకు వచ్చింది. సత్తెనపల్లిలో గతంలో నమోదైన కేసులో అంబటిపై పీటీ వారెంటు జారీ అయింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడిందని అంటున్నారు. గురువారం మాజీ మంత్రి అంబటిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. గత ఏడాది నవంబరు 12న గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో అంబటికి బుధవారం బెయిలు మంజూరైంది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన న్యాయమూర్తి, అంబటి దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను అనుమతిస్తూ తీర్పునిచ్చారు. దీంతో గురువారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే బెయిలు వచ్చిన ఆనందం ఎంతసేపు లేకుండానే పోలీసులు అంబటికి షాక్ ఇచ్చారు. గతంలో సత్తెనపల్లెలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా లాటరీ లాటరీ టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో అంబటిపై కేసు నమోదు అయింది. దీనిపై ఆయనకు సత్తెనపల్లె కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. సత్తెనపల్లె పోలీసులు గురువారం ఆయనను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారని అంటున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సత్తెనపల్లె కోర్టు నుంచి పీటీ వారెంటు జారీ కావడంతో అంబటి జైలు గేటు వరకు వచ్చి ఆగిపోయినట్లైందని అంటున్నారు. గత నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు ఈ నెల 9వ తేదీన బెయిలు మంజూరైంది. అయితే అదే రోజు అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంటు జారీ అయింది.
గత ఏడాది నవంబరు 12న పట్టాభిపురం పోలీసుల విధి నిర్వహణకు అడ్డు పడ్డారని కేసులో అంబటిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. దీంతో 9న ఒక కేసులో బెయిలు వచ్చినా, అంబటి జైలు నుంచి విడుదల కాలేకపోయారు. ఇక ఈ రోజు సైతం సేమ్ సీన్ రిపీట్ అయింది. పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యాహ్నం అంబటి బెయిలు పొందారు. కోర్టు పత్రాలు అందిన తర్వాత గురువారం ఆయన విడుదల అవుతారని అంతా ఆశించారు. అయితే ఆ ఆశలపై నీళ్లు జల్లుతూ సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంటు తీసుకున్నారు.
దీంతో అంబటి విడుదల మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. రెండు కేసుల్లో బెయిలు పొందిన అంబటి విడుదల సత్తెనపల్లి కోర్టు నిర్ణయంపై ఆధారపడివుందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. లాటరీ కేసులో బెయిలు ఇస్తే ఆయన గురువారం సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని లేని పక్షంలో మళ్లీ సెంట్రల్ జైలుకు వెళ్లక తప్పదని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత అంబటిని జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయనపై వరుస కేసుల నమోదు, పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి. దీంతో అంబటిని ఇప్పట్లో బయటకు వదిలే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.