ఫ్యామిలీ డిన్నర్ మీట్... నాడు జగన్ అలా, నేడు లోకేష్ ఇలా!

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గగ్గోలు పెట్టినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.;

Update: 2026-02-11 17:19 GMT

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గగ్గోలు పెట్టినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కలేక, మింగలేక మిన్నకుంటే.. మరికొంతమంది మాత్రం ఆఫ్ ది రికార్డ్ తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వెల్లడించేవారు! అయితే ఆ పరిస్థితికి తావు లేకుండా ఏపీ మంత్రి లోకేష్ సరికొత్త ఆలోచన చేశారని తెలుస్తోంది.. ఇది ఆసక్తిగా మారింది!

అవును... రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ తెరలేపనున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా.. ప్రస్తుతానికున్న సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాలు సుమారు 17 రోజులు జరగనున్న నేపథ్యంలో.. ప్రతీరోజూ సాయంత్రం ఏడుగురు ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవ్వడంతో పాటు ఆ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా డిన్నర్ చేయనున్నారని తెలుస్తోంది.

తద్వారా మిగిలిన పక్షాల ఎమ్మెల్యేల సంగతి కాసేపు పక్కనపెడితే... తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అయినా పూర్తిగా కొన్ని గంటలు వ్యక్తిగతంగా, మరికొంత సమయం వారి కుటుంబ సభ్యులతోనూ కలిసినట్లు ఉండటంతో పాటు.. వారి వారి నియోజకవర్గాల్లో సమస్యలు, పార్టీ పరిస్థితి, ప్రజల అభిప్రాయల గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే.. కచ్చితంగా ఇది సరికొత్త అధ్యాయం అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... జనసేన 21 మంది, బీజేపీ 8 మంది కాకుండా టీడీపీకి అసెంబ్లీలో 135 మంది ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఈ సెషన్స్ లో కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీల విషయానికొస్తే... మండలిలోని 58 మంది ఎమ్మెల్సీలలో ఇద్దరు జనసేన, ఇద్దరు బీజేపీల సంగతి కాసేపు పక్కనపెడితే.. టీడీపీకి ప్రత్యేకంగా 10 మంది ఎమ్మెల్సీలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపు "ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్" కార్యక్రమం వైరల్ అయ్యే అవకాశాలున్నాయి!

అలా అని లోకేష్ ప్రత్యేకత ఈ ఒక్క కార్యక్రమానికే పరిమితం కాని సంగతి తెలిసిందే. ప్రధానంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ "ఎక్స్" వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపైనా లోకేష్ వెంటనే స్పందిస్తున్నారు. ఆ సమస్యను తన టీమ్ కు అసైన్ చేస్తున్నారు.. దీంతో వారు ఫాలో అప్ చేసి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, సమస్యను వేగంగా పరిష్కరిస్తున్న సంగతి తెలిసిందే!

మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో... మార్చి 7 వరకూ, 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Similar News