దోమలు పట్టుకోబడును!! ఏపీలో ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ
దోమలు పట్టుకోబడును ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఏపీలో దోమలు పట్టుకునే ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.;
దోమలు పట్టుకోబడును ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఏపీలో దోమలు పట్టుకునే ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వినడానికి కొత్తగా ఉన్నా, సీజనల్ వ్యాధులను ముందుగానే పసిగట్టి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటుంది. అయితే 15 ఏళ్లుగా ఈ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడగా, కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. దోమల సంతతిని గుర్తించి, వాటి వ్యాప్తిని అడ్డుకునే 'ఇన్సెక్ట్ కలెక్టర్ల'కు (కీటకాల సేకరణ ఉద్యోగులు) మంగళగిరి వేదికగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి శిక్షణ ఇవ్వడం విశేషంగా చెబుతున్నారు.
వ్యాధులను వ్యాప్తి చేసే దోమలను గుర్తించడంలో సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. దోమల మూలాలను గుర్తించి జ్వరాలకు చెక్ చెప్పడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. దోమల సంతతిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మెళుకవలను ఉద్యోగులకు నేర్పిస్తున్నారు. మలేరియా వచ్చేందుకు కారణమయ్యే ఎనాఫిలిస్ దోమ, డెంగీ/ చికెన్ గున్యాకు కారణమయ్యే ఎడిస్, పైలేరియా/మెదడు వాపు వచ్చేందుకు కారణమయ్యే క్యూలెక్స్ దోమల లార్వా దశను, పెద్ద దోమలను గుర్తించడంపై ఫోకస్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా 2011 సంవత్సరం తరువాత ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రాక్టికల్స్ శిక్షణ కార్యక్రమాలు జరుగతున్నాయి. ఇందులో భాగంగా మలేరియా కేసులు ఎక్కువగా ఉండే ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి , ఇతర చోట్ల ఉండే కీటకాల రకాలు, వాటి ఉనికి, కదలికలు, వృద్ధి, గుర్తింపు అంశాలపై ఇన్సెక్ట్ కలెక్టరు బుధవారం తెల్లవారుజామున శిక్షణ పొందారు. వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగుల విధుల నిర్వహణకు తగ్గట్లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది.
గత ఏడాది గుంటూరు సమీపంలో ఒక గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అదేవిధంగా రాష్ట్రంలో పలుచోట్ల డయేరియా కేసులు ప్రభుత్వానికి చికాకు కలిగించాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి సీజనల్ వ్యాధులు కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. ఈ క్రమంలో దోమలు పట్టుకోవడం, వాటి జాతిని నిర్ధారించే విషయమై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
'మస్కిటో కలెక్షన్ ట్యూబ్ ద్వారా పట్టివేత
దోమలు పట్టుకోవడం ఎలా? అవి ఏ సంతతికి చెందినవి, వాటివల్ల వచ్చే సమస్యలపై ఉద్యోగులకు శిక్షణలో సీనియర్లు అవగాహన కలిస్తున్నారు. సాధారణంగా పట్టుకున్న వెంటనే దోమలు ప్రాణాలు విడుస్తాయి. కానీ శిక్షణ పొందిన సిబ్బంది 'మస్కిటో కలెక్షన్ ట్యూబ్ ద్వారా దోమలు పట్టుకుంటారు. గోడలు, మూలలు, మరుగుదొడ్లు, ఇతర ప్రదేశాలపై విశ్రాంతి దశ (ముఖ్యంగా రాత్రి సమయాల్లో) ఉన్నప్పుడు టార్చ్ లైట్ సాయంతో 'మస్కిటో కలెక్షన్ ట్యూబ్ను నోట్లో పెట్టుకుని పీల్చుతారు. అప్పుడు దోమలు ట్యూబ్లోనికి వెళ్లి తెరగా ఉన్నచోట అగిపోతాయి. వాటిని ప్రత్యేకంగా పరీక్షించి, పట్టుబడిన దోమలు ఏ రకం, వాటివల్ల ఎటువంటి జ్వరాలు వస్తాయన్న దానిపై అవగాహనకు వస్తారు.అలాగే వాటి నిరోధానికి చర్యలు తీసుకుంటారు నీటి గురించి శిక్షణలో సమగ్రంగా వివరిస్తున్నారు.
సత్వరం చర్యలు తీసుకునేలా..!
దోమల వల్ల వచ్చే సమస్యలను గుర్తించి, స్థానిక జిల్లా మలేరియా, ఇతర అధికారులకు తెలియచేసి, నిరోధ చర్యలు తీసుకునే విధంగా వీరు వ్యవహరిస్తారు. సమాచారాన్ని అనుసరించి, సదరు అధికారులు యాంటీ లార్వా ఆపరేషన్, ఇండోర్ స్పేస్, ఇండోర్ రెసిడ్యుల్ స్ప్రే, ఫాగింగ్ వంటి చర్యలు తీసుకుంటారు. ఇన్సక్ట్ కలెక్టరు తమ జోన్ పరిధిలో 'హాట్ స్పాట్'గా గుర్తించిన చోట్ల కీటకాల విస్తృతిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, అదనపు సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు.