ఎగ్జిట్ పోల్స్ : 'పుర'పీఠాలపై 'హస్తం' హవా.. ఆధిక్యంలో కాంగ్రెస్!
తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.;
తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోబోతుందని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు ఈ ఎన్నికలు గట్టి దెబ్బ కానున్నాయని సర్వే అంచనా వేసింది.
కార్పొరేషన్లలో కాంగ్రెస్ జైత్రయాత్ర
మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయనుంది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని పట్టు నిలుపుకోబోతోంది. ఆశ్చర్యకరంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్‌ను కూడా గెలుచుకోలేకపోవచ్చని సర్వే పేర్కొంది.
మున్సిపాలిటీల్లోనూ అదే జోరు
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 68 నుంచి 76 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంటే దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు హస్తగతం కానున్నాయని అంచనా.
బీఆర్ఎస్: 29-36 మున్సిపాలిటీలు
బీజేపీ: 3-5 మున్సిపాలిటీలు
ఇతరులు: 8-14 మున్సిపాలిటీలు గెలుచుకోవచ్చు.
ఓట్ల శాతం.. వార్డుల అంచనా
మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ 36% తో అగ్రస్థానంలో ఉండగా.. బీఆర్ఎస్ 29.7%, బీజేపీ 19.3% ఓట్లు సాధించే అవకాశం ఉంది. వార్డుల పరంగా చూస్తే..
కాంగ్రెస్: 1210 - 1290 వార్డులు
బీఆర్ఎస్: 860 - 930 వార్డులు
బీజేపీ: 250 - 270 వార్డులు
ఎంఐఎం: 35 - 44 వార్డులు పొందే అవకాశం ఉంది.
రామగుండం, మంచిర్యాల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించబోతోంది. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోగా కొన్ని చోట్ల ఎంఐఎం 'కింగ్ మేకర్' పాత్ర పోషించనుంది.
ఉత్కంఠకు తెరపడేది అప్పుడే?
ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న శుక్రవారం న వెల్లడికానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి తన సత్తా చాటినట్టే. అయితే అసలు ఫలితాల్లో ఏవైనా అనూహ్య మార్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి.