ఉద్యమ కేసులు.. అవినీతి కేసులు ఒకటేనా హరీశ్?
తెలుగు రాష్ట్రాల్లో మాటలతో ఒక పట్టాన ఓడించలేని రాజకీయ నాయకులు కొందరే ఉంటారు.;
తెలుగు రాష్ట్రాల్లో మాటలతో ఒక పట్టాన ఓడించలేని రాజకీయ నాయకులు కొందరే ఉంటారు. అవసరానికి తగ్గట్లు రాజకీయ విమర్శలు మాత్రమే కాదు.. విషయాల మీద అవగాహన.. ప్రజా సమస్యల మీద పట్టు వారిలో కనిపిస్తుంది. అలంటి కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు. ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా పని చేసిన అనుభవాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. సీనియర్ నేతగా.. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా.. ప్రత్యర్థులను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేస్తూ.. భావోద్వేగాల్ని టచ్ చేసేలా మాట్లాడే నేర్పు హరీశ్ లో చాలా ఎక్కువని చెప్పాలి.
అలాంటి హరీశ్ .. తాను చేసే వ్యాఖ్యల్లో దొరికిపోవటం చాలా తక్కువగా ఉండేది. పదేళ్లు నాన్ స్టాప్ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హరీశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అడ్డంగా బుక్ అయ్యేలా చేయటమే కాదు.. ఆయన వర్తమానంలో చేస్తున్న వ్యాఖ్యలు.. గతాన్ని గుర్తు చేసేలా చేసి.. కామెడీగా మారుతున్నాయి. తనను అరెస్టు చేస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తానని చెప్పిన ఆయన.. ఉద్యమంలో తనపై నమోదు చేసిన కేసుల ప్రస్తావన తెస్తున్నారు.
ఉద్యమ కాలంలో తనపై 300 కేసులు పెట్టారని.. వాటికి తాను భయపడలేదన్న హరీశ్.. తాజాగా తనపై ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారంటూ ప్రభుత్వం లీకులు ఇస్తుందని మండిపడుతున్నారు. ఓవైపు కేసులు నాకో పెద్ద విషయం కాదన్నట్లుగా చెబుతూనే.. మరోవైపు తనపై అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటానని.. వారి సంగతి భవిష్యత్తులో చూస్తానని వ్యాఖ్యానించటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం.. ఆ సందర్భంగా నమోదైన కేసులను ఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి సంబంధించిన అంశంలో కేసును నమోదు చేయటం ఒక్కటేనా? అన్నది ప్రశ్న. నిజానికి ఈ రెండింటిని ఏ రకంగానూ కలిపే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈ రెండు అంశాల్ని కలగలిపి విమర్శలతో విరుచుకుపడటం హరీశ్ లాంటి సీనియర్ నేతకు సూట్ అవుతుందా? అన్నది ప్రశ్న.
హరీశ్ ఆరోపిస్తున్నట్లుగా రేవంత్ ప్రభుత్వం తనపై కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తుందనే మాటనే తీసుకుంటే.. ఇప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి కేసు హరీశ్ మీద నమోదు చేయలేదు కదా? అలాంటప్పుడు కేసులు నమోదు కాకముందే.. కేసులు పెట్టేస్తున్నారు.. అలా చేసే వారి సంగతి చూస్తానంటూ చెప్పే మాటలు ఆయన ఎంత గత్తరకు గురవుతున్నారన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి హరీశ్ రావు లాంటోళ్లకు ఈ తరహా గత్తర మాటలు సూట్ కావు. తనకు నప్పే ఫార్మాట్ ను వదిలేసి.. ఇలా అతకని మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్లు? అన్నదిప్పుడు చర్చగా మారింది.