సీఎం సీటు...డీకే షాకింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి పదవి అన్నది ఏ రాజకీయ నాయకుడి జీవితంలో అయినా కీలకమైనది. రాజకీయ పరమ పద సోపానంలో అధి చివరిదిగా భావిస్తారు.;
ముఖ్యమంత్రి పదవి అన్నది ఏ రాజకీయ నాయకుడి జీవితంలో అయినా కీలకమైనది. రాజకీయ పరమ పద సోపానంలో అధి చివరిదిగా భావిస్తారు. ఎన్నో సార్లు నిచ్చెన మెట్లు ఎక్కిన వారు పాము నోట్లో పడకుండా రాజకీయ వైకుంఠపాళిలో చివరాఖరుకు చేరుకోవాలని ఉన్నత స్థానంలో నిలిచి గెలవాలని కోరుకుంటారు. అయితే కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరు గడించిన ఉప ముఖ్యమంత్రి సీనియర్ నేత డీకే శివ కుమార్ కి మాత్రం సీఎం పదవి అన్నది అందరి ద్రాక్షగా మారుతోంది. ఈ పదవిని చేపట్టాలని ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆయన అభిమానులు అయితే 2023 మే నేలలో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి సీఎం అని తమ నాయకుడి గురించి గట్టిగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు.
ఒప్పందం దూరం :
చెరి రెండున్నర ఏళ్ళ పాటు సీఎం సీటు ఇద్దరు నేతలూ పంచుకోవాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం 2023 ఎన్నికల ఫలితాల తరువాత డీకే శివ కుమార్ కి అలాగే ప్రస్తుత సీఎం సిద్ధ రామయ్యకు మధ్య ఒక రాజీ కుదిర్చినట్లుగా ప్రచారం సాగింది. ఆ ఒప్పందం అయితే గత ఏడాది నవంబర్ తో పూర్తి అయింది. ఇంకా నాలుగు నెలలు గడచిపోయాయి. డీకే మాత్రం సీఎం కాలేకపోయారు. మరో వైపు అయిదేళ్ళూ తానే సీఎం అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు డీకేలో ఒకింత వైరాగ్యం అలాగే రాజకీయంగా నిర్వేదాన్ని కలుగచేస్తున్నాయని అంటున్నారు.
కాలమే చెప్పాలి :
ఇక డీకే తన వ్యూహాలు ప్రయత్నాలు అదృష్టాలు అన్నీ కూడా నమ్ముకుని కూడా సీఎం కాలేకపోయారు. దాంతో కాలానికే ఆయన విడిచిపెట్టారు. తాజాగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఎపుడు సీఎం అవుతాను అన్నది చెప్పాల్సింది కాలమే అని తేల్చేశారు. కాలం ఎపుడు చెబితే అపుడు తాను సీఎం సీట్లో కూర్చుంటాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే తాను హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పెద్దలు మాత్రం :
ఇక కాంగ్రెస్ పెద్దలు అయితే డీకే సిద్ధ రామయ్యల మధ్య సామరస్యం కోసమే ప్రయత్నించినట్లుగా ఇటీవల వారిద్ధరి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్స్ లంచ్ మీటింగ్స్ స్పష్టం చేశాయి. అదే సమయంలో మధ్యలో సిద్ధరామయ్యను ఎందుకు తప్పించడం అన్నది కూడా హైకమాండ్ కి ఉన్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. పెద్దాయన గా బీసీ నేతగా బలమైన లీడర్ గా ఉన్న సిద్ధ రామయ్యను తప్పించేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదని పరిణామాలు చెబుతున్నాయి. దాంతో చేసేది లేకనే డీకే కాలమని అంటూ భారం అక్కడ వేశారు అని చెబుతున్నారు. 2028 దాకా సిద్ధరామయ్య కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి గెలవాలి. లేకపోతే డీకే కోరిక తీరడం జీవిత కాలం లేటు అవుతుందా అంటే దానికి కూడా జవాబు కాలమే చెప్పాల్సి ఉంది.