మంత్రి ఉత్తమ్ మీటింగ్.. అంతిమ యాత్రను ఆపేసిన కోరుట్ల ఖాకీలు

స్వామి భక్తి ఎక్కువైతే అనూహ్య రీతిలో షాకులు ఎదురవుతాయి. ఇలాంటి ఉదంతాలతో ఉన్న మైలేజీ పోయి డ్యామేజ్ మిగిలుతుంది.;

Update: 2026-02-08 04:31 GMT

స్వామి భక్తి ఎక్కువైతే అనూహ్య రీతిలో షాకులు ఎదురవుతాయి. ఇలాంటి ఉదంతాలతో ఉన్న మైలేజీ పోయి డ్యామేజ్ మిగిలుతుంది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు కొందరు రాజకీయ నేతలు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలీసులు ప్రదర్శించిన స్వామిభక్తితో ఎలాంటి తిప్పలు ఎదురవుతాయన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఉదంతం. మంత్రిగారి కార్నర్ మీటింగ్ పేరుతో.. ఆ మార్గంలో వస్తున్న అంతిమ యాత్రను సైతం అరగంట పాటు ఆపిన వైనం ఇప్పుడు వివాదంగా మారింది. అసలేం జరిగిందంటే..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అసలే మంత్రిగారు.. అందునా రాష్ట్రంలోని పవర్ ఫుల్ మంత్రుల్లో ఒకరైన మంత్రి కావటంతో ఆయన మీటింగ్ కు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు.. భారీగా పోలీసుల్ని మొహరించారు. ఇదేం తప్పు కాదు. కానీ.. ఇక్కడే మంత్రిగారి మనసు దోచుకోవాలనుకున్నారో.. ఆయన ప్రసంగ ఫ్లోకు బ్రేకులు పడకూడదనుకున్నారో ఏమో కానీ.. ఉత్తమ్ కార్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒక అంతిమ యాత్ర మీటింగ్ సమీపానికి వచ్చింది.

పట్టణానికి చెందిన కళావతి మరణించగా ఆమె అంతిమయాత్ర.. సరిగ్గా మంత్రి ఉత్తమ్ కార్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే చేరుకుంది. కార్నర్ మీటింగ్ ఉందని.. ఆ వైపు వెళ్లేందుకు వీల్లేదని.. మంత్రిగారి మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనని.. నిలిపేశారు. ఓవైపు మంత్రిగారు.. మరోవైపు పోలీసులు.. అసలే తమ మనిషి పోయిందన్న వేదనలో ఉన్న వారు.. మారు మాట్లాడకుండా తమ అంతిమయాత్రను ఆపేసి వెయిట్ చేయసాగారు.

దాదాపు 30 నిమిషాల పాటు పాడెను మోస్తూనే ఉండిపోయారు. దీంతో మహిళలు.. పెద్ద వయస్కులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న మంత్రిగారి మీటింగ్ ను కవర్ చేయటానికి వచ్చిన జర్నలిస్టులు.. పోలీసుల పనిని కవర్ చేసేందుకు ఆ వైపునకుపెద్ద ఎత్తున వెళ్లారు. ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. అనుకోని రీతిలో చోటుచేసుకున్న ఈ వైనంతో పోలీసు ఉన్నతాధికారులు ఏం జరిగిందో తెలుసుకొని.. వెంటనే దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు. అరగంటకు పైగా ఆపేయించిన అంతిమయాత్రను కంటిన్యూ అయ్యేలా చేసి.. కార్నర్ మీటింగ్ లో నాయకుల ప్రసంగాన్ని కాసేపు ఆపించారు. అంతిమయాత్ర సాగేందుకు దారి కల్పించారు. ఇదేదో ముందే చేసి ఉంటే.. మంత్రి ఉత్తమ్ కార్నర్ మీటింగ్ వివాదంలో చిక్కుకునేది కాదుగా అన్న మాట వినిపిస్తోంది. అంతిమయాత్రకు సంబంధించిన మేళాలు.. మోతల్ని నేతల్లో ఎవరో ఒకరు గుర్తించినా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News