టీడీపీలో రాజకీయ కుటుంబాలు తెర వెనక్కేనా ?

ఎక్కడైనా ఒక్కటే రూల్ ఉంటుంది. పాత నీరు కదలదు, దానంతట అది ముద్నుకు సాగేందుకు సంకోచిస్తుంది. కానీ కొత్త నీరు సర్రున వచ్చి ఈ పాత నీరుని అంతా కొట్టుకుని పోయేలా చేస్తుంది. దాంతో పాత నీరు జారిపోయి మరుగున పడిపోతుంది.

Update: 2026-07-25 04:00 GMT

తెలుగుదేశం పార్టీ వయసు నాలుగున్నర దశాబ్దాలు. ఆ పార్టీ పుట్టినది లగాయితూ ఎంతో మంది వచ్చి చేరారు. అలాగే పార్టీని నమ్ముకుని ఎదిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ పదవులు కూడా అనుభవించిన వారు ఉన్నారు. దశాబ్దాల పాటు హవా చలాయించిన ఈ రాజకీయ కుటుంబాల హవా ఇపుడు ఎక్కడా కనిపించదేమేమి అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు ఈ కుటుంబాలకు గతమే కానీ భవిష్యత్తు లేదా అన్న ప్రశ్నలు కూడా పుట్టుకుని వస్తున్నాయి.

గతమెంతో ఘనకీర్తిగా :

ఇక టీడీపీతోనే ఎదిగి ఎంతో స్థాయికి చేరిన రాజకీయ కుటుంబాలు చూస్తే అనేకం కనిపిస్తాయి. వాటిలో చూసుకుంటే ప్రముఖమైనవిగా చెప్పాల్సింది కోడెల శివప్రసాద్, కేఈ కృష్ణమూర్తి, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు, గల్లా అరుణ కుటుంబాలు గురించే. ఈ కుటుంబాలకు చెందిన వారికి పదవులు గ్యారంటీ అన్నది గతంలో ఉండేది. వారు పార్టీలో కీలకంగా మెలిగిన సంగతులను కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇపుడు వీరికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని అంటున్నారు. అదే విహంగా వారు కూడా పరిస్థితులను తెలుసుకుని అలా ఉండిపోతున్నారని కూడా వినిపిస్తోంది.

కొత్త నీరు వచ్చేసి :

ఎక్కడైనా ఒక్కటే రూల్ ఉంటుంది. పాత నీరు కదలదు, దానంతట అది ముద్నుకు సాగేందుకు సంకోచిస్తుంది. కానీ కొత్త నీరు సర్రున వచ్చి ఈ పాత నీరుని అంతా కొట్టుకుని పోయేలా చేస్తుంది. దాంతో పాత నీరు జారిపోయి మరుగున పడిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం అని అంటున్నారు. టీడీపీలో చూసినా కొత్త నీరు వచ్చేసింది. ఎక్కడికక్కడ కొత్త వారు కనిపిస్తున్నారు. పార్టీ సైతం వారిని ప్రోత్సహిస్తోంది. ఇదే సమయంలో కుటుంబాలు కేరాఫ్ అడ్రసుల పేరు చెప్పినా చాలా మందికి సమీకరణలు కుదరడం లేదు. పార్టీ కూడా తాజా ముఖం కోసం చూస్తోంది. జనం నాడిని పసిగడుతూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దాంతోనే ఒకనాడు ఎంతటి ప్రముఖ్య కుటుంబం అయినా ఇపుడు తెర వెనక్కి వెళ్లాల్సి వస్తోంది అని అంటున్నారు.

పార్టీనే అట్టిపెట్టుకుని :

అయితే ఈ కుటుంబాలు ఏవీ పార్టీని వీడడం లేదు. అట్టి పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం అయితే టీడీపీ టికెట్ ని గత ఎన్నికల్లో ఆశించారు. అది కుదరలేదు. అయినా సరే పార్టీలోనే ఉంటున్నారు. అలాగే రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ బీసీ నేత కేఈ క్రిష్ణ మూర్తి కుమారుడు శ్యాం బాబుకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. కానీ మంత్రి పదవి అయితే అందని పండుగానే మిగిలింది. ఇక కేఈ క్రిష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కి అయితే ఏ పదవీ లభించలేదు. అయినా వారంతా ఆశాభావంతోనే ఉన్నారని అంటున్నారు. అలాగే ఇతర నేతల కుటుంబాలు సైతం పసుపు నీడనే నమ్ముకున్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ కొత్త వారు వస్తూనే ఉంటారు. దాంతో పాత తరానికి ఏ మేరకు సర్దుబాటు చేయగలరు అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీలో విధేయతగా ఉన్న వారే ఎక్కువ. అందుకే టీడీపీ ఎక్కడికక్కడ పటిష్టంగా ఉంది. అదే సమయంలో విధేయతతో ఉన్న వారికి ఏదో రోజున న్యాయం జరుగుతుంది అన్న మాట కూడా ఉంది.

Tags:    

Similar News